పూనిక ఓకే.. పూడిక లేకే!

by  |
పూనిక ఓకే.. పూడిక లేకే!
X

దిశ, రంగారెడ్డి:
చెరువులు, కుంటల్లో పూడికతీసి వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా భూగర్భ జలాలు పెంచాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్లో పూడిక మట్టిని తీసి, కట్టలను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని 2015లో సీఎం కేసీఆర్​అధికారికంగా ప్రారంభించారు. మెదటి రెండేండ్లు మిషన్ కాకతీయ పనుల్లో కాస్త హడావిడి చేసినా.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం పనులన్నీ అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా.. వారు చెరువుల మట్టిని ఇష్టారాజ్యంగా ట్రిప్పుల చొప్పున అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంతో పాటు కాంట్రాక్టర్ల అసమర్థత ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.

లక్ష్యం చేరలేదు..

ఐదేళ్ల కాలంలో జిల్లాలో 2,033 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 68,904 ఎకరాల విస్తీర్ణంలోని ఆయకట్టు భూములను సాగులోకి తీసుకురావాలని భావించారు. ఈ పథకాన్ని ప్రారంభించి నాలుగేళ్లు కావొస్తుంది. మొదటి విడతలో 325 చెరువులను పునరుద్ధరించాల్సి ఉండగా 310 చెరువుల్లో పనులు జరిగాయి. ఇంకా 15 చెరువులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండో విడతలో 407 చెరువులకుగాను 357 చెరువులు పునరుద్ధరించగా.. ఇంకా 50 చెరువుల్లో పనులు అలాగే ఉన్నాయి. మూడో విడతలో 228 చెరువులకుగాను 144 చెరువుల్లో పూడిక తీయగా.. 84 చెరువుల్లో పనులు ఆగిపోయాయి. అలాగే నాల్గో విడతలో 96 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 34 చెరువుల్లో పనులు అడపాదడపా చేపట్టి వదిలేశారు. ఇంకా 62 చెరువుల్లో పనులు ప్రారంభించడం లేదు.

మట్టి పక్కదారి..

మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా చెరువుల్లోని మట్టిని రైతుల పొలాలకు తరలించాల్సి ఉండగా.. మట్టి అవసరమైన రైతులు ప్రస్తుతం కొనుగోలు చేయాల్సిన దుస్థితి. వెంచర్లలో రోడ్డు వేసేందుకు, ఇటుక బట్టీలకు కొత్తగా గృహనిర్మాణాల బేస్‌మెంట్‌ నింపేందుకు కూడా కాంట్రాక్టర్లు ఈ మట్టిని అమ్ముకున్నట్టు ఆరోపణలున్నాయి. మొదటి, రెండు విడతల్లో చూపిన ఉత్సాహం.. మూడు, నాలుగు విడతల్లో కనిపించడం లేదు. మొదటిదశ పనుల్లో 90 శాతం వరకు పూర్తి కాగా.. రెండు, మూడు దశల్లో చేపట్టిన పనులు చాలావరకు నిలిచిపోయాయి.

Tags : Rangareddy, Mission kakatiya, Ponds, Soil Sailing

Next Story

Most Viewed