పండుగ అని ప్రభుత్వాస్పత్రిలో పేషెంట్లకు అన్నం పెట్టలే

by  |
OP-Section1
X

దిశ, గోదావరిఖని: గోదావరిఖని శారదా నగర్ లోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో గత నాలుగు రోజులుగా పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల నాయకులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపడుతూ ఆస్పత్రిలో డైట్ కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి రామగుండం, గోదావరిఖనితోపాటు ఇతర గ్రామాల నుంచి ఎంతోమంది గర్భిణీ మహిళలు డెలివరీ కోసం వస్తుంటారు. అయితే దూరప్రాంతం నుంచి వచ్చినవారితోపాటు డెలివరీ అయినవారికి ప్రతి రోజూ ఉదయం పాలు.. మధ్యాహ్నం కోడి గుడ్డు, అన్నం, కూర, పప్పు.. సాయంత్రం అన్నం, కూర ఈ విధంగా వారికి ఉచితంగా ఆహారం అందిస్తుంటారు.

అయితే గత 3 రోజుల క్రితం గర్భిణీ మహిళలకు పురుగు ఉన్న ఆహారాన్ని అందించారు. ఈ విషయాన్ని “దిశ’ దినపత్రికలో పేషెంట్ల అన్నంలో జెర్రీ పురుగు అనే కథనం ప్రచురితం కావడంతో వెంటనే స్పందించిన గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి సదరు కాంట్రాక్టర్ విజయ్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినా తమ తీరు మార్చుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం గర్భిణీ మహిళలకు అందించాల్సిన ఆహారాన్ని సైతం అందించకుండా డైట్ మెస్ కు తాళం వేసుకొని సిబ్బంది వెళ్లిపోవడం పట్ల పలువురు రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూరప్రాంతం నుంచి వచ్చినవారు ఇక్కడే భోజనం చేస్తూ ఉంటారు. అయితే నిబంధనల ప్రకారం గర్భిణీ మహిళలకు ఆహారం అందించకుండా ‘ఈరోజు పండుగ.. సెలవు దినం’ అని సిబ్బంది చెప్పడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, విజయ్ కుమార్ అనే హైదరాబాద్ కు చెందిన వ్యక్తికి డైట్ కాంట్రాక్టు రావడంతో సదరు కాంట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన గోదావరిఖని వాసికి సబ్ కాంట్రాక్టు ఇచ్చాడు. దీంతో అతను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధించిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతోపాటు ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.



Next Story