షాపింగ్‌మాల్స్‌‌కు దూరంగా వినియోగదారులు!

by  |
షాపింగ్‌మాల్స్‌‌కు దూరంగా వినియోగదారులు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం తెచ్చిన నష్టం నుంచి ఈ ఏడాది పండుగ సీజన్ కాపాడుతుందని భావించిన షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద మార్కెట్ ప్లేస్ వ్యాపారులకు నిరాశ తప్పేలా లేదు. కరోనా ఆందోళన కారణంగా, ఎక్కువమంది వినియోగాదరులు దగ్గరలోని లోకల్ మార్కెట్లకు, చిన్న షాపింగ్ దుకాణాలకు వెళ్తుంటే, మరికొందరు ఆన్‌లైన్‌లో తమ పండుగ కొనుగోళ్లను పూర్తి చేస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ.. వినియోగదారులు దీపావళికి పెద్ద మార్కెట్ ప్లేస్, బడా షాపింగ్ మాల్స్‌కు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు.

లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. ఈ దీపావళికి పట్టణాల్లో ఉండే ప్రధాన మార్కెట్లకు వెళ్లేందుకు 66 శాతం వినియోగదారులు ఆసక్తి చూపించటంలేదని తేలింది. వీరు స్థానిక మార్కెట్లకు, దగ్గరలో ఉండే చిన్న చిన్న షాపింగ్ స్టోర్‌లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు సర్వేలో స్పష్టమైంది. సర్వే వివరాల ప్రకారం.. పండుగ షాపింగ్ కోసం 20 శాతం మంది వినియోగదారులు మాత్రమే పట్టణాల్లోని ప్రధాన మార్కెట్లకు సందర్శించాలని భావిస్తున్నారు. కొవిడ్-19 వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న కారణంగా ఎక్కువ జనసందోహం ఉండే ప్రదేశాల కంటే స్థానికంగా ఉండే షాపులకు, చిన్నా చితక స్టోర్‌లలో ఈ పండుగ సీజన్ షాపింగ్ చేయడం సురక్షితమని ఎక్కువ మంది భావిస్తున్నారు. చిన్న వ్యాపారులు సైతం తమ స్టోర్‌లకు వచ్చే వినియోగదారులు పెరిగారని చెబుతున్నారు.

ఆన్‌లైన్ షాపింగ్‌కు సై…

లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వేలో..మొత్తం 16 వేల మంది పాల్గొన్నారు. టైర్ 1 నగరాల నుంచి 61 శాతం మంది, టైర్ 2 నుంచి 27 శాతం, టైర్ 3,4, గ్రామీణ ప్రాంతాల నుంచి 12 శాతం మంది పాల్గొన్నారు. వీరిలో 65 శాతం మంది పురుషులు ఉండగా, 35 శాతం మంది మహిళలు ఉన్నారని లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి ఆందోళనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో..మరికొంతమంది నేరుగా మార్కెట్లకు వెళ్లడం కంటే ఆన్‌లైన్ షాపింగ్‌ని ఇష్టపడుతున్నారు. ఈ-కామర్స్ కంపెనీలు అక్టోబర్ నుంచి ఆఫర్లను ప్రకటించడంతో ఇప్పటికే చాలామంది వినియోగదారులు పండుగ కొనుగోళ్లలో ఎక్కువ భాగం ఆన్‌లైన్‌లో చేసినట్టు సర్వే పేర్కొంది. షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లలో లాక్‌డౌన్ సడలింపులు ఎత్తివేసినప్పటికీ.. పండుగ సీజన్ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ ఎక్కువమంది వినియోగదారులు వాటికి దూరంగా ఉన్నారని సర్వే వెల్లడించింది.


Next Story

Most Viewed