వినియోగదారుడు మారాడు.. పరిస్థితులకు అనుకూలంగా ఆలోచనలు

by  |
వినియోగదారుడు మారాడు.. పరిస్థితులకు అనుకూలంగా ఆలోచనలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా అనేక మార్పులు వస్తున్నాయి. ప్రజల ఆలోచన సరళీ మారింది. ముఖ్యంగా అత్యవసరమైన సరుకులను మాత్రమే కొనుగోలు చేసే విధానాన్ని అవలంభిస్తున్నారు. ఎక్కడ కొనాలి? ఏ వస్తువులను కొనాలి? అనేవే ప్రధానంగా ఆలోచిస్తున్నారని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కరోనాతో ఒక్కసారిగా ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన జాగ్రత్తలను పాటించాలని నిర్ణయించుకుంటున్నారు. ఇటీవలి ఓ పరిశోధనలో భారతీయ వినియోగదారుల ప్రవర్తన గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిత్యం కొనుగోలు చేసే సామగ్రి జాబితాలో మార్పు చేయాలని 60 శాతం మంది భావిస్తున్నట్టు తేలింది. ఈవై ఫ్యూచర్ కన్జ్యూమర్ ఇండెక్స్ సేకరించిన వివరాల ప్రకారం వినియోగదారులు 5 రకాలుగా మారినట్టు తెలుస్తోంది. ఇందులో…38 శాతం మంది కరోనా సంక్షోభాన్ని అధిగమించి ఇంకొంత ఉత్సాహంగా ఉండాలని భావిస్తున్నారు. వీరు ఇంతకుముందు కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. 29 శాతం మంది మరింత పొదుపు చేయాలనే ఉద్దేశ్యంతో ఖర్చులను చాలా వరకు తగ్గించుకుంటున్నారు. 19 శాతం మంది ఖర్చులను తగ్గించుకోవడం మంచి ఉపాయమని, అవసరమైన వాటికి మాత్రమే జేబులోంచి డబ్బు తీస్తున్నారు. 11 శాతం మంది సాధారణ పరిస్థితుల కంటే అత్యంత జాగ్రత్తగా ఉండాలని భావించే వారు.. అవసరమైన వాటిలో కూడా ఏది ముఖ్యమైనదో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. 2 శాతం మంది పెద్దగా మార్పులు అక్కరలేదంటూ కరోనాకు ముందులాగా కొనుగోలు నిర్వహిస్తున్నారు.

ఇంటర్నెట్ వినియోగం…

కరోనా భయం, లాక్‌డౌన్ కారణంగా చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఉద్యోగాలు చేసేవారి ఇంటర్నెట్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఏ అంశమైనా ఇంటర్నెట్ ద్వారానే చర్చిస్తున్నారు. ఉద్యోగం, ఇతర పనులు, వినోదం ఇలా అన్ని విషయాలు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు. కొవిడ్-19 వల్ల డిజిటల్ వినియోగం అత్యధికంగా పెరిగింది. దీంతో ఆన్‌లైన్ కస్టమర్ల సంఖ్య ఎగసింది. ఇండియాలో సగటు వ్యక్తి ఇంటర్నెట్ వినియోగ సమయం రోజుకు రెండున్నర గంటలకు పెరిగిందని నివేదిక వెల్లడించింది. సినిమాలు, పాటలు, యూట్యూబ్ వీడియోలు‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌లాంటి వేదికల కోసం 28 నిమిషాలను కేటాయిస్తున్నారు. సోషల్‌ మీడియా అప్లికేషన్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, లింక్‌డ్ ఇన్‌ లాంటి వాటికోసం 25 నిమిషాలని, జీ-మెయిల్‌, మెసేజ్‌ బోర్డ్‌లులాంటి సర్వీస్‌లు వినియోగం కోసం 23 నిమిషాలను, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌‌లాంటివాటికి కోసం 19 నిమిషాలను, ఆన్‌లైన్‌లో ఆడే డిజిటల్‌ గేమ్స్‌ కోసం 12 నిమిషాలను, వార్త ఛానెళ్లు చూడటం, ఏదైనా ప్రత్యేకమైన విషయం గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడాని 7 నిమిషాలను, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ మొదలైన ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం సగటున 4 నిమిషాలను కేటాయిస్తున్నారు.

స్థానిక ఉత్పత్తులకు డిమాండ్..

వినియోగదారుల రోజూవారి అంశాల్లో అనేక మార్పులొచ్చాయి. ఆరోగ్యానికి సంబంధించి ఏ వస్తువును కొనాలన్నా రక్షితమైన, నాణ్యమైన వాటినే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే, ఆహారం విషయంలో, షాపింగ్ చేయడంలో అతి జాగ్రత్తగా ఉంటున్నారు. అంతేకాకుండా, స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా పెరిగింది. సీపీజీ బ్రాండ్‌లు స్థానిక వస్తువులను వినియోగదారులకు చేరవేసే ప్రయత్నాలు చేయడం మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భవిష్యత్తుపై అంచనా ముఖ్యం..

వ్యక్తిగత సమయాన్ని కేటాయించగలిగే ఈ పరిస్థితుల్లో ఇష్టాలను, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి వస్తువులు అవసరమైనవో, ఆయా వస్తువులు ఎలాంటి నాణ్యత కలిగి ఉన్నాయో సరి చూసుకుని కొనాలని సూచిస్తున్నారు. కరోనా ఎప్పుడు వదులుతుందో చెప్పలేని స్థితిలో ఉన్న కారణంగా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయాలను తీసుకోవడం ఉత్తమమైన ఆలోచన. ఖర్చు తగ్గింపుతో పాటు, భవిష్యత్తు పెట్టుబడిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story

Most Viewed