‘భారత ప్రజలమైన మేము…’

by  |
‘భారత ప్రజలమైన మేము…’
X

“భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్నిఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకుని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాము’’ అని రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజ్యాంగ పరిషత్ (నిర్ణాయక సభ)లో చదివి వినిపించారు. ఆ భారత రాజ్యాంగ పీఠిక లేదా ప్రవేశిక, రాజ్యాంగంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎన్నడూ లేనంత చర్చ జరుగుతున్నది. 70 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఎమర్జెన్సీ తర్వాత అంత చర్చ మళ్లీ ఇప్పుడే జరుగుతున్నది. ముంబయిలోని మహీమ్ దర్గాలో పీఠికను ప్రతిష్టించారు. పీఠిక పఠనం ఆరంభించారు. పవిత్ర ప్రదేశంలో పీఠిక ప్రతిష్టింపబడిన మొదటి ప్రదేశంగా మహీమ్ దర్గా చరిత్రకెక్కింది.
రాజ్యాంగం చైతన్యం రగలాల్సిందే..
భారత రాజ్యాంగాన్ని పలువురు న్యాయ నిపుణులు న్యాయవాదుల స్వర్గంగా అభివర్ణించారు. అందుకు కారణం రాజ్యాంగ పరిషత్‌లో ఎక్కువ మంది న్యాయవాదులని కాదు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ చేరువయ్యే విధంగా ఏర్పాటు చేయడమే. కానీ, భారతదేశంలో రాజ్యాంగం గురించి విద్యావ్యవస్థలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం లేదు. అసలు ప్రాథమిక అవగాహన కూడా పౌరుడికి ఉండే పరిస్థితి లేదు. ఇందుకు రాజకీయ వ్యవస్థ, పార్టీలు కూడా కారణం కావొచ్చు. ఎందుకంటే అంబేద్కర్ ఓ సందర్భంలో రాజ్యాంగ చైతన్యంపై మాట్లాడుతూ రాజ్యాంగ చైతన్యం ప్రజల్లో రగిలితే, ఈ ప్రభుత్వాలు నిలబడటం కష్టమనీ, ఆ భయంతోనే ప్రభుత్వాలు రాజ్యాంగం గురించి ప్రవచించడం లేదని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగమే ఆయుధంగా..
రాజ్యాంగం న్యాయవాదులకు మాత్రమే కాదని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అన్నారు. ఆయనే మరో సందర్భంలో రాజ్యాంగం ప్రజల లక్ష్యాలు ఆశయాలను సాధించేందుకు ఉపయోగపడాలనీ, శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ వంటి వలస కాలం నాటి పద్ధతులకు స్వస్తి పలికి రాజ్యాంగం కల్పించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారాలు సాధించాలని కోరారు. ‘‘ఒక మనిషి-ఒక ఓటు సాధించాము కానీ, ఒక మనిషి ఒక విలువ సాధించేందుకు ఇప్పుడు కృషి జరగాలి’’ అని కూడా చెప్పారు. గత ఆరేళ్ల కాలంలో జాతీయ స్థాయిలో రాజ్యాంగ స్ఫూర్తికి, మౌలిక భావనలకు ప్రమాదం తీవ్ర స్థాయిలో పెరిగిన ఈ సందర్భంలో ప్రజలు, భిన్న రాజకీయ పార్టీలు భారత రాజ్యాంగంలోకి తొంగి చూడటం మంచిదే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో నిరసనకారులు రాజ్యాంగాన్నే ఆయుధంగా చేత ధరిస్తున్నారు. దళిత, మైనార్టీ ఐక్య ఉద్యమ నిర్మాత, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ రావణ్ ఒక చేత్తో త్రివర్ణ పతాకాన్నీ, మరో చేత్తో రాజ్యాంగం పట్టకుని సీఏఏ వ్యతరేక ఉద్యమంలో భాగంగా ఢిల్లీ జామామసీదులో నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అక్కడ ఒక్క చోటే కాదు, జేఎంయూ, జేఎన్‌యూ, దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో యువకులు మువ్వన్నెల పతాకాలనూ, రాజ్యాంగాన్ని చేతబూని ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
మౌలిక స్వభావంపైన దాడులూ..
రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడులు చేసేందుకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వెనుకాడటం లేదనే విమర్శలున్నాయి. భారత రాజ్యాంగ తొలిప్రతిలో లౌకిక, సామ్యవాదం అన్న పదాలు లేవు కాబట్టి వాటిని తీసేద్దామని కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇంకా బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే లౌకిక పదం అవసరం లేదని అన్నారు. ఆ పార్టీ ఎంపీ ప్రగ్నాసింగ్ ఠాకూర్ గాడ్సేను దేశభక్తుడని అభివర్ణించింది. గాంధీ సారథ్యంలోని స్వాతంత్ర్యోద్యమం డ్రామా అని తాజాగా అనంతకుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగం, రాజ్యాంగ పీఠిక, స్వాతంత్ర్యోద్యమంపై ఎంత కూలంకష చర్చ జరిగితే అంత మంచిదనే వాదన ఉంది.
లౌకికంపై పెద్ద చర్చే..
భారతదేశం లౌకిక రాజ్యం. అంటే మత ప్రమేయం లేని రాజ్యం. ఈ అంశంపై రాజ్యాంగ పరిషత్‌లో పెద్ద చర్చే జరిగింది. భారత రాజ్యం భగవంతుని పేరు మీద సాగాలని హెచ్.వి.కామత్ అనే రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ప్రతిపాదించాడు. అప్పుడు మిగతా సభ్యులు ఏ భగవంతుని పేరు మీద రాజ్యం సాగాలని అడిగారు. కొంతమంది సభ్యులు హిందూ రాజ్యంగా ప్రకటించాలన్నారు. కొంతమంది కృష్ణుని పేరు మీదుండాలన్నారు. దీంతో ఈ అంశంపై ఓటింగ్ నిర్వహించారు. మెజార్టీ సభ్యులు లౌకికంగానే ఉండాలని ఓటేశారు. అయితే, పీఠికలో లౌకిక పదం లేకపోయినప్పటికీ ఆర్టికల్ 14 ద్వారా చట్టం ముందు అందరూ సమానులే అనే దాంట్లో లౌకిక స్వభావం ఉందని, భారత సంస్కృతి లౌకికమేనని ఇక పేరెందుకు చేర్చడమని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక పదాన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం పీఠికలో చేర్చింది. ఎస్.ఆర్.బొమ్మై వర్సెస్ స్టేట్ ఆప్ కర్నాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ ‘‘లౌకికతత్వం భారత రాజ్యాంగం అంతర్భాగమనీ, 42వ సవరణ ద్వారా చేర్చబడిన ‘లౌకిక’ పదం రాజ్యాంగంలో నిబిడీకృతమై ఉన్నదనీ, లౌకికతత్వం భారత రాజ్యాంగం మౌలిక స్వరూపంలో భాగమని’’ చెప్పింది. ఇవన్నీ విస్తృతంగా భారత ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరమున్నది. ఎందుకంటే బీజేపీ అధికారంలోకొచ్చిన ఈ ఆరేండ్లలో ఎక్కువగా మతంపైనే చర్చ జరుగుతున్నది. మతం గురించి ఓ కవి ‘‘మతం కంటే ముందే/మనిషి పుట్టుక/ఏ మతం ఆపింది/చావు, పుట్టుక’’ తన కవితలో అద్భుతంగా పేర్కొన్నారు. మతం వ్యక్తిగతం అన్న విషయం, రాజ్యం మతం ప్రమేయం లేనిదని గుర్తెరగాలి. సర్వమత సమభావన, వసుధైక కుటుంబం గురించి ప్రపంచానికే చాటి చెప్పిన భారతావనిలో మతవిభజన వస్తున్నదన్న విషయాన్ని గుర్తించాలి.
లక్ష్యాలు, ఆశయాలే ముఖ్యం
భారత ప్రజల లక్ష్యాలు ఆశయాల గురించి అంబేద్కర్ రాజ్యాంగం పరిషత్‌లో మాట్లాడుతూ ‘‘రాజ్యాంగం ద్వారా ప్రజలు తమ లక్ష్యాలూ, ఆశయాలూ నెరవేరుతాయని ఆశిస్తున్నారు. కానీ, ఒకవేళ ఈ రాజ్యాంగ నిర్మిత రాజకీయ వ్యవస్థ ప్రజల ఆకాంక్షల్నీ, ఆశల్నీ నెరవేర్చకపోతే మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ వ్యవస్థలను ప్రజలే చిదిమేస్తారు. చెరిపేస్తారు.’’అని హెచ్చరించారు. రాజ్యాంగం అంటే అసలు ఏమిటీ.. ప్రభుత్వ నిర్మాణం, అది పని చేసే విధానాలు తెలిపేది రాజ్యాంగం. ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి. రాజ్యాంగానికి అనుగుణంగానే చట్టాలు చేయాలి. లేదంటే కోర్టులు వాటిని కొట్టేస్తాయి. రాజ్యాంగంపై ఇంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పక చరిత్ర రాజ్యాంగ నిర్మాణ క్రమం పరిశీలించాలి. ప్రభుత్వాలు ఎట్లా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నడిచాయో, నడిచేందుకు యత్నిస్తున్నాయో ప్రజలు తెలుసుకోవాలి.

Next Story