ఇక మాకు ‘వనమా’ వద్దు.. మళ్లీ ఆ లీడరే కావాలి..!

207
Khammam Politics

దిశ ప్రతినిధి, ఖమ్మం: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో వనమా వెంకటేశ్వరరావు ఫ్యామిలీ కూడా రాజకీయంగా సమాధి అయినట్టేనా..? తండ్రి తర్వాత నియోజకవర్గాన్ని ఏలాలనుకున్న కొడుకు రాఘవ పని ఇక అయిపోయినట్టేనా..? వీరి తర్వాత కొత్తగూడెంలో కారు స్టీరింగ్ పట్టేదెవరు..? వెంకట్రావు బలం పెరగనుందా..? జనం ఫోకస్ ఇప్పుడు మళ్లీ జలగంపైకి మళ్లిందా..? గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన ఇప్పటి నుంచి తన బలగాన్ని ఇంకా పెంచుకోనున్నారా..? ఇవన్నీ ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశాలు. వనమా రాఘవతో కొన్నేళ్లుగా ఇబ్బందులు పడ్డ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు మళ్లీ జలగం అయితే బాగుంటుందని చర్చించుకుంటున్నారు. అంతేకాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ అధిష్టానం కూడా తమ పార్టీ క్యాండిడేట్ కోసం ఇప్పటినుంచే దృష్టిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వనమాతో అక్కడ పార్టీకి ఇబ్బందే తప్ప ఎలాంటి లాభం లేదనే అభిప్రాయానికి కూడా వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు మళ్లీ జలగం అయితేనే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

వనమాకు నో చాన్స్..?

వాస్తవానికి నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వరరావుకు మంచి పేరే ఉన్నప్పటికీ, దాన్ని మాత్రం కొడుకు రాఘవ పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటూ వచ్చాడు. కొన్నేళ్లుగా నియోజకవర్గంలో ఆయన చేయని అరాచకాలు లేవంటే అతిశయోక్తి కాదు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో కూడా రాఘవ అంటే ఎవరికీ గిట్టదనే ప్రచారమూ ఉంది. కాకపోతే భయపడో, భక్తి ప్రదర్శించాలనో.. లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయనో కానీ ఎవరూ ఇప్పటి వరకు బయటపడలేదు. ఎవరైనా రాఘవకు వ్యతిరేకంగా మాట్లాడితే పరిస్థితి వేరేలా ఉండేది. ఈ క్రమంలోనే రామకృష్ణ కుటుంబం ఆత్మహుతి.. అదీ రాఘవపై ఆరోపణలు చేయడంతో రాష్ట్రం మొత్తం అట్టుడికింది. ఈ క్రమంలోనే ఇంటాబయటా అందరినుంచీ తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఏకంగా రాఘవను బహిరంగంగా ఉరితీయాలంటూ అందరూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును సైతం రాజీనామా చేయాలని ఇప్పటికీ పట్టుబడుతున్నారు. ఇక ప్రభుత్వానికి సైతం అన్ని పార్టీల నుంచి వనమా సెగ తగిలింది. దీంతో అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాఘవ అరెస్టైన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇక కొత్తగూడెంలో పార్టీ తరఫున వనమా కుటుంబానికి అవకాశమే లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జలగం వెంకటరావు పేరు మళ్లీ నియోజకవర్గ జనాల్లో వినిపిస్తోంది.

మళ్లీ జలగం..

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జలగం వెంకటరావు. అప్పటి నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ఆ తర్వాత 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన వనమా వెంకటేశ్వరరావుపై ఓడిపోయారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా వనమా హస్తం పార్టీనుంచి టీఆర్ఎస్‌లో చేరడంతో ఇరువర్గాల మధ్య కొంత కాలం గ్యాప్ ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం కూడా వనమా కుటుంబానికే ప్రియార్టీ ఇవ్వడంతో జలగం అప్పటినుంచి పార్టీలో కొనసాగుతున్నా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అడపా దడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే తన కేడర్‌ను మాత్రం కాపాడుకుంటూ వస్తూనే ఉన్నారు. 2014లో ఆయన గెలిచిన తర్వాత పనులు చేశాడన్న పేరుతో పాటు తన తండ్రి జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మార్క్ ఎప్పటినుంచే ఉంది. రాఘవ ఘటనతో మళ్లీ జలగం అయితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

2014లో గెలిచిన తర్వాత..

జలగం వెంకటరావు 2014లో గెలిచిన తర్వాత కొత్తగూడెంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా కొత్తగూడెం ప్రజల కోసం సెంట్రల్ పార్క్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. ఇక గూడెంలో ఎయిర్ పోర్ట్ విషయంలో అప్పుడు ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు.. విమానాశ్రయానికి స్థల సేకరణ సహా ఎప్పటికప్పుడు అధికారులను ఫాలోఅప్ చేస్తూ దగ్గరుండి మరీ అన్ని పనులు పర్యవేక్షించారు. అయితే కొన్ని కారణాల వల్ల కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు పనులు ఆగిపోగా.. 2018లో ఆయన ఓటమి తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. ఇక కొత్తగూడెంలో ప్రధాన రోడ్ల విస్తరణతో పాటు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేశాడన్న పేరు ప్రజలతో పాటో అధికారుల్లోనూ ఉంది. అయితే ఆ పనులన్నీ జలగం ఓడిపోయిన తర్వాత అటకెక్కాయి.

ఇప్పటికీ బలం అలాగే..

నియోజకవర్గంలో జలగం కుటుంబానికి మంచి పేరుంది. 2018లో వెంకటరావు ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉన్నా, తన అనుచరులను, కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు. ఎవరికి ఏ పని కావాలన్నా చేసి పెడుతూ ఉండడం వల్ల ఆయన మార్క్ అలాగే ఉండిపోయింది. జలగం హైదరాబాద్‌లో ఉంటూ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా స్పందిస్తూ వస్తున్నారు. జలగం తరపున ఆయన అనుచరులు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలపై ఎప్పటిప్పుడు పోరాడుతూనే ఉన్నారు. ఇక దివంగత సీఎం జలగం వెంగళరావు కొడుకుగానూ సుపరిచితుడే.

వివాద రహితుడిగా పేరు..

జలగం వెంకటరావుకు అటు పార్టీ కేడర్‌లో కానీ, ఇటు అధికారుల వద్ద కానీ వివాద రహితుడిగా పేరుంది. అంతేకాదు అనుకున్న పనులు సాధించేందుకు అధికారుల వెంటపడి పనులు చేయించుకునే వారని చెబుతారు. ముఖ్యంగా వనమా కుటుంబంలా అన్నింట్లో తలదూర్చే వ్యక్తి కాదని నియోజకవర్గ ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. వర్గాలను ప్రోత్సహించడం కానీ, అనవసర వివాదాల్లో తలదూర్చడం జలగం నైజం కాదని ఆయన సన్నిహితులు కూడా అంటున్నారు. భూకబ్జాలు, సెటిల్మెంట్లు, వ్యతిరేకించిన వారిని ఇబ్బందులకు గురిచేయడం వంటివాటి జోలికి జలగం వెళ్లరనే టాక్ ప్రజల్లో ఎప్పటినుంచో ఉండనే ఉంది.

ఇక ప్రజలకు అందుబాటులో..

జలగం వెంకటరావు 2018లో ఓటమి తర్వాత హైదరాబాద్‌లోనే ఉంటూనే నియోజకవర్గంపై మళ్లీ పట్టు సాధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెంలో ఎలాంటి సంఘటనలు జరిగిన స్పందిస్తూనే ఉన్నారు. రాఘవ గత ఉదంతాలపై కూడా జలగం ఎన్నోసార్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే సంక్రాంతికి నియోజకవర్గానికి వెంకటరావు రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు జలగం వర్గీయులు చెబుతున్నారు.