విషాదం.. తల్లిని ఒంటరి చేసిన కానిస్టేబుల్

by  |
విషాదం.. తల్లిని ఒంటరి చేసిన కానిస్టేబుల్
X

దిశ, మలక్‌పేట: పోలీసు కొలువు కొట్టిన కొడుకు కండ్ల ముందు యూనీఫాం వేసుకొని తిరుగుతుంటే ఆ తల్లి మురిసిపోయింది. కానీ, ఆ తల్లి మురిపం తీరకముందే కొడుకు కానరాని లోకాలకు వెళ్లాడు. కొన్నేండ్ల క్రిందట భర్తను కోల్పోయిన ఆమె.. చివరకు చేతికొచ్చిన కొడుకును కూడా కోల్పోయి ఒంటరై పోయింది. ఈ విషాద ఘటన ముషీరాబాద్‌ మండలం రాంనగర్‌లో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందాడు. ఈ ప్రమాదం మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… రాంనగర్ ప్రాంతానికి చెందిన ప్రణీత్ కుమార్ ( 2020 బ్యాచ్) మహంకాళి పోలీస్‌స్టేషన్‌‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా డీసీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే శనివారం తెల్లవారుజామున మూసారాంబాగ్‌లో ఉండే మిత్రుడిని కలిసేందుకు రాంనగర్‌ నుంచి బైక్‌పై బయల్దేరాడు ప్రణీత్. సరిగ్గా మూసారాంబాగ్‌లోని స్వామి వివేకానంద సెంటనరీ స్కూల్ వద్దకు రాగానే ప్రణీత్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం.. డివైడర్ మీదుగా యూ టర్న్ చేసుకుంటున్న మరో బైక్ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మరో బైకర్‌ మరళీ మనోహర్‌కు కూడా గాయాలు అయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలో తరలించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు. ఇది ఇలా ఉంటే.. చేతికొచ్చిన కొడుకు అకాల మరణం చెందడంతో కన్న తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు.

Next Story