రేవంత్‌ సభ.. ఆ ముగ్గురు కీలక నేతలు డుమ్మా

by  |
revanth reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగింపు సభకు ఆ పార్టీ సీనియర్ నేతలు ముఖం చాటేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పీసీసీ పదవిని ఆశిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మధుయాష్కీ, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులెవ్వరూ ఈ సభకు హాజరుకాలేదు. మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, కొండా సురేఖ, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, సురేష్ షేట్కర్, మల్లు రవి, ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పరిగి రామ్మోహన్, మల్‌రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్ తదితరులంతా హాజరయ్యారు. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఈ సభకు హాజరైతే పార్టీ శ్రేణులకు తప్పుడు సందేశం వెళ్తుందన్న ఉద్దేశంతో హాజరుకాలేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ఒక్కతాటిపై నడిపించి రాష్ట్రంలో బలోపేతం చేయాల్సిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇప్పుడు రేవంత్‌రెడ్డి సభకు గైర్హాజరుకావడం పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి కొండా సురేఖ ఆ వేదిక మీద నుంచే స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టగల, సరైన వ్యక్తి రేవంత్‌రెడ్డి మాత్రమేనని, రైతుల కోసం పాదయాత్ర చేసినందుకు ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఎవరు ఎటువైపో తేలినట్లే!

రేవంత్ రెడ్డి సభతో కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎటువైపో ఒక స్పష్టత వచ్చినట్లయింది. కేసీఆర్‌కు దీటుగా మాటలతోనే ప్రజలను ఆకర్షించగలిగిన నాయకుడిగా రేవంత్‌‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీలో చాలా మంది పీసీసీ చీఫ్‌గా ఆయనకు మద్దతు పలికారు. ఇదే విషయాన్ని పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ సైతం మీడియాకు బహిరంగంగానే వివరించారు. కానీ నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా పీసీసీ చీఫ్ ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ సభకు ప్రజలు తరలిరావడం, పార్టీలోని చాలామంది నాయకులు హాజరుకావడం ఆయన పట్ల ఉన్న మద్దతు వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా పీసీసీ చీఫ్ విషయంలో ఆయనను వ్యతిరేకించినవారికి రేవంత్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్, పార్టీలో ఉన్న మద్దతు ఈ సభ ద్వారా స్పష్టమైనట్లయింది. పార్టీ లైన్‌కు అనుగుణంగా నిర్వహించిన పాదయాత్ర, భారీ సంఖ్యలో ప్రజలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఉత్తమ్ హాజరు కావడం ద్వారా తన నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శించుకోడానికి ఉపయోగపడేదని, అందరినీ కలుపుకుపోతున్నారన్న సందేశం ఇచ్చినట్లయ్యేదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించారు. ఇప్పుడు రేవంత్‌కు లభించిన ప్రజాదరణ రానున్న నాగార్జునసాగర్ ఎన్నికల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అభ్యర్థిగా నిల్చునే జానారెడ్డిపై పడే అవకాశం ఉంది. రానున్న కాలంలో ఎవరికి మద్దతు ఇవ్వడమో ఖరారు చేయడానికి ఈ సభ వీలు కల్పించింది.



Next Story

Most Viewed