అహంకారపూరితంగా మాట్లాడితే ఊరుకోం.. జీవన్ రెడ్డి హెచ్చరిక

by  |
Congress MLC Jeevan Reddy
X

దిశ, జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జగిత్యాల పట్టణంలో డీసీసీ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల్లో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై అసంతృప్తి ఏర్పడిందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తప్పించుకుంటే, రైతుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.

ధనిక రాష్ట్రం అని చెప్పుకునే టీఆర్ఎస్ సర్కార్, కేవలం మద్యం మీదనే రూ.30 వేల కోట్లు ఆర్జిస్తోందని అన్నారు. గతంలో మొక్కజొన్నకు మద్దతు ధర లభించకపోవడం మూలంగానే రైతులు వరిపంట పండించడం ప్రారంభించారని గుర్తుచేశారు. ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం అని చెప్పుకునే కేసీఆర్ సర్కార్ రైతుల కోసం రూ.21 వందల కోట్ల ఖర్చు పెట్టలేదా? అని ప్రశ్నించారు. యాసంగిలో వడ్లు కొనం అని అహంకార పూరితంగా మాట్లాడితే రైతులు ఊర్కోరని, వచ్చే ఎన్నికల్లో మీకు సరైన బుద్ధి చెపుతారని హెచ్చరించారు. రైతాంగాన్ని మిల్లర్లు దోపిడీకి గురి చేశారని, ఎలక్ట్రానిక్ తుకానికి అనుగుణంగా రైతులకు ధర చెల్లించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిరి నాగభూషణం, తాటిపర్తి దేవేందర్ రెడ్డి, బండ శంకర్, గాజెంగి నందయ్య, కండ్లపెల్లి దుర్గయ్య, జున్ను రాజేందర్, గాజుల రాజేందర్, యూత్ నాయకులు ముంజాల రఘువీర్ గౌడ్, కిరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story