ఎంపీ అరవింద్ నోరు మూసుకో.. తోలు తీస్తాం : కాంగ్రెస్ నేతల వార్నింగ్

by  |
ఎంపీ అరవింద్ నోరు మూసుకో.. తోలు తీస్తాం : కాంగ్రెస్ నేతల వార్నింగ్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమింపబడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు భయంతో కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తాం అంటూ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, జిల్లా అర్బన్ ఇంచార్జ్ తాహెర్బిన్ హందాన్, రూరల్ ఇన్చార్జీ భూపతి రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అదృష్టవశాత్తు ధర్మపురి అరవింద్ పార్లమెంటు సభ్యులుగా చిన్న వయసులో ఎంపికయ్యారు. కానీ, ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్న ఆయనకు ఏవిధంగా మాట్లాడాలో తెలియడం లేదని ఆయన అన్నారు. అరవింద్‌కు రాజకీయపరమైన అవగాహన లేకపోతే మీ తండ్రి డి. శ్రీనివాస్ దగ్గర నేర్చుకోవాలని హితవు పలికారు.

అరవింద్‌కు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని అంటున్నారు. కానీ, తన తండ్రి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అరవింద్‌కు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం ఉందో జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు అని అన్నారు. ఎంపీ అరవింద్ నోటి నుంచి వచ్చే భాష సెప్టిక్ ట్యాంక్ కంటే దారుణంగా ఉంటుందని, పార్లమెంటు సభ్యుడిగా ఉండి అభివృద్ధి చేయలేక, నిధులు తీసుకురాలేక ప్రజలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

దీని ద్వారా ప్రజలను మభ్యపెట్టి కాలం గడుపుతున్నాడని విమర్శించారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డిపై గానీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. తోలు తీస్తాం అని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విషయంలో విమర్శలు చేసుకుంటున్నాయని, కానీ రెండు దొందూ దొందే అని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధును కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే మాత్రమే ప్రకటించడం జరిగిందని, నిజంగా కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు, అదేవిధంగా బీసీ బంధు, ఎస్సీ బంధు, ఎస్టీ బంధు అమలు చేయాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విక్కీ యాదవ్, ఎన్ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా ప్రాపగండ కమిటీ చైర్మన్ జావిద్ అక్రమ్‌లు పాల్గొన్నారు.

Next Story