హుజురాబాద్ బరిలో నిలిచేదెవరు? రేవంత్‌ మీటింగ్‌లో ఏం తేలింది?

by  |
congress meeting on huzurabad by poll
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో ఎవరిని నిలబెట్టాలా అనే అంశంపై కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఎన్నికల నిర్వహణ కమిటీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందిరా భవన్‌లో బుధవారం సమావేశమయ్యారు. బీజేపీ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైన నేపథ్యంలో విజయావకాశాలు ఉన్న నేతల గురించి చర్చిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ జిల్లాకు చెందిన ఈర్ల కొమురయ్య, ప్యాట రమేష్ తదితరుల పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఇంకా ఆసక్తి చూపుతున్నవారితో పాటు ఈ జిల్లాలో ప్రజాదరణ ఉన్న నేతల గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికిప్పుడు పేర్లను ప్రకటించకపోయినా క్షేత్రస్థాయిలో పార్టీ తరపున ప్రచారాన్ని త్వరలోనే మొదలుపెట్టాలని, షెడ్యూలు వచ్చిన తర్వాత అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించాలనుకుంటున్నట్లు తెలిసింది.

ముందుగానే పేర్లను ప్రకటించడంలో ఉన్న ఇబ్బందులతో పాటు ఇతర పార్టీల వ్యూహాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం ఉత్తమమనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమయ్యాయి. చివరి నిమిషంలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలాగానే కొత్తవారు కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చి చేరే అవకాశముందని, అలాంటి వారి విషయంలో ఏ వైఖరి అవలంబించాలన్నది కూడా వీరి మధ్య ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. పలువురు నేతలు మాత్రం టీఆర్ఎస్ నుంచి వచ్చే వ్యక్తులకు టికెట్ ఇవ్వకపోవడమే మంచిదంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఇప్పటివరకూ హుజూరాబాద్‌పై దృష్టి పెట్టని కాంగ్రెస్ ఇక నుంచి కార్యాచరణ మొదలు పెట్టాలనుకుంటున్నది. పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పటీ వాటిని వదులుకుని రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి వచ్చారు. ఎన్నికల సంఘం షెడ్యూలు ఎప్పుడు ప్రకటిస్తుందనే అంశంతో సంబంధం లేకుండానే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు చీలిపోకుండా పటిష్టంగా కాపాడుకోవడంపై ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి పోటీ చేసినప్పుడు అరవై వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అధికార పార్టీ పట్ల అనేక గ్రామాల్లో వ్యతిరేకత పెరిగినందున మరింత ఎక్కువ స్థాయిలోనే ఓటు బ్యాంకు పెరుగుతుందన్న ధీమాను చాలా మంది ఈ సమావేశంలో వ్యక్తం చేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలపై సమావేశం జరగడం ఇదే తొలిసారి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డిలతో పాటు హుజురాబాద్ ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed