కేసీఆర్‌కు గిన్నీస్‌బుక్‌లో చోటివ్వాలి.. VH సంచలన వ్యాఖ్యలు

by  |
Congress leader V.Hanumantha Rao
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సీరియస్ కామెంట్స్ చేశారు. శుక్రవారం గన్‌పార్క్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి సీఎంను గిన్నీస్ బుక్‌లోకి ఎక్కించాలని ఎద్దేవా చేశారు. 2014 ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పుడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఎప్పుడు చెప్పలేదనడం సిగ్గుచేటన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత దళితబంధు రూ.10 లక్షలు ఇస్తానని తాను ఎప్పుడూ అనలేదని మాట మారుస్తాడని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో 54 శాతం బీసీలు ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చెప్పారని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అదే సమగ్ర కుటుంబ సర్వేను ఢిల్లీకి పంపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అబద్ధాలు విని ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. చిన్నజీయర్ స్వామిని కలిసి కేసీఆర్ అబద్ధాలు చెప్పకుండా బోధించాలని కోరుతానని, గవర్నర్ తమిళిసై బతుకమ్మ సంబురాల్లో పాల్గొని, ఆట ఆడటం చాలా సంతోషం అన్నారు. బతుకమ్మల మీద నుంచి కారు తీసుకెళ్లిన ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తానని వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story