‘బుచ్చిరాజుది కేటీఆర్ చేసిన హత్యే’

by  |
Congress leader Dasoju Shravan
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ అబద్ధాలకు మరో తెలంగాణ బిడ్డ నిండు ప్రాణం బలైందని, అంకం బుచ్చిరాజుది ముమ్మాటికీ ప్రభుత్వహత్యేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగిత్యాలకు చెందిన అంకం బుచ్చిరాజు 12 ఏళ్లుగా ఎస్పీడీసీఎల్ లో సబ్ స్టేషన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడని, ఇంతకాలం ఉద్యోగం చేసినా రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయకపోవడంతో నిరాశ చెందిన ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్యగా పేర్కొన్నారు. 22,637 మందిని రెగ్యులర్ చేసినట్లు మంత్రి కేటీఆర్ గొప్పలు చెబుతున్నారని, కానీ అదంతా పచ్చి అబద్ధమనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తులు.. ప్రజల జీవితాలతో చెలగాటమాడే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని దాసోజు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ చేసిది క్షుద్ర రాజకీయమని, వారి మోసాలకు అంతే లేకుండా పోయిందని విమర్శించారు.

కేటీఆర్ చెప్పవన్నీ పచ్చి అబద్ధాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చేయకుండా ఆర్టిజన్ అనే ఒక విభాగం ఏర్పాటు చేసి వాళ్ళకు ఎలాంటి సర్వీస్ రూల్స్ అందకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. వారికి వెల్ఫేర్ బెనిఫిట్స్ కూడా రాకుండా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. బుచ్చిరాజు రూ.25 వేలు వరకు జీతం తీసుకున్న ఉద్యోగని, కేటీఆర్ చెబుతున్న ఆర్టిజన్ల కారణంగా అతడి జీతం రూ.9వేలకు పడిపోయిందని దాసోజు తెలిపారు. దొంగ ఆర్డర్లు తీసుకొచ్చి ఇంకెంత మంది యువకుల జీవితాలను బలిచేస్తారని ఆయన కేటీఆర్ ను ప్రశ్నించారు. ఈ ఘటనతో కేసీఆర్, కేటీఆర్ కు పతనం ప్రారంభమైందని ఆయన తెలిపారు. అంకం రాజుకు మూడేళ్ల పాప ఉందని, ఇప్పుడా కుటుంబం పరిస్థితేంటని శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు అతడి భార్యకు విద్యుత్ రంగ సంస్థలో ఉద్యోగం కల్పించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి కాంగ్రెస్ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.



Next Story

Most Viewed