భార్యభర్తల మధ్య ఘర్షణ.. గొడవలో తలదూర్చి భర్తను చావగొట్టిన యువకులు

by GSrikanth |   ( Updated:2022-06-14 16:17:09.0  )
భార్యభర్తల మధ్య ఘర్షణ.. గొడవలో తలదూర్చి భర్తను చావగొట్టిన యువకులు
X

దిశ, కుత్బుల్లాపూర్: హైదరాబాద్‌లోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తల గొడవలో తలదూర్చిన నలుగురు యువకులు భర్తను దారుణంగా కొట్టిచంపారు. ఈ దారుణ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్ఐ రాంబాబు వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన తపస్విణి-శరత్(48)లు గత ఆరు నెలల కింద నగరానికి వలస వచ్చి నగర శివారులోని గుండ్లపోచంపల్లిలో రమణయ్య అనే వ్యక్తికి చెందిన ఇటుకల బట్టీలో పనిచేస్తూ.. అక్కడే గుడిసే వేసుకొని నివాసం ఉంటున్నారు. ఈనెల 12న రాత్రి 10 గంటల సమయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సూపర్‌వైజర్ వెంకటాద్రినాయుడు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత శరత్ సూపర్‌వైజర్‌తో గొడవకు దిగే ప్రయత్నం చేయగా సమీపంలో ఉన్న మరో ఇటుక బట్టీ యజమాని సాంబశివరావు అలియాస్ సాంబయ్య శరత్‌ను మందలించాడు.

అప్పటికే ఆవేశంతో ఊగిపోతున్న శరత్ చేతిలో ఉన్న కర్రతో సాంబయ్య తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న సూపర్వైజర్ వెంకటాద్రినాయుడు హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. అయితే తమ యజమాని సాంబయ్యను కొట్టాడని ఆగ్రహానికి గురైన అతని కూలీలు(ఒరిస్సాకు చెందిన సోంవార్, ప్రదీప్, బోరా, అజయ్) నలుగురు మూకుమ్మడిగా శరిత్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రగాయాలైన శరిత్‌ను తన యజమాని రమణయ్య స్థానిక మల్లారెడ్డి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు గాంధీ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఈనెల 13న ఉదయం 9.50 గంటలకు మృతిచెందాడు. మృతుడి భార్య తపస్విణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాంబాబు తెలిపారు. దాడికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed