మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

by  |
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
X

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తున్నార‌న్న నెపంతో కేసులు పెట్టి జైలుకు పంపుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, అత‌ని సోద‌రుడు శ్రీకాంత్ గౌడ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని ప‌లువురు బాధితులు గురువారం రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వివరాళ్లోకి వెళితే… మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా మంత్రి, అత‌ని సోద‌రుడు చేస్తున్న అక్ర‌మాలు, భూ క‌బ్జాల‌పై పోరాడుతున్న వారిపై అక్ర‌మంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నార‌ని బాధితులు కృష్ణ‌ముదిరాజ్, గోనెల శ్రీనివాస్, డి.ప‌ర‌మేశ్వ‌ర్, ఎం.మ‌హేష్, వర్ధ భాస్క‌ర్, కిష‌న్ ప‌వార్, రాచాల శ్రీధ‌ర్, విశ్వ‌నాథ్ భాండేక‌ర్ త‌దిత‌రులు వాపోయారు.

ఈ మేరకు గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ… పోలీసుల అండ‌దండ‌ల‌తో డీఎస్పీ, సీఐ, ఎస్సై‌లు కేసులు పెడుతూ.. భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని అన్నారు. అంతేగాకుండా బీసీ నాయ‌కుడు రాఘ‌వేంద్ర‌రాజుపై మంత్రి సోద‌రుడు శ్రీకాంత్ గౌడ్ కావాల‌నే అక్ర‌మ కేసులు పెట్టించి ఇంటిపైకి దౌర్జ‌న్యంగా వ‌చ్చి దాడి చేశార‌ని, ఇంట్లోని ఫ‌ర్నీచ‌ర్‌ను ధ్వంసం చేశార‌ని తెలిపారు. రాఘ‌వేంద్ర రాజుపై భౌతిక దాడికి పాల్ప‌డి హ‌త్య చేసేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. ఈ విష‌యంలో పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డానికి వెళ్తే పోలీసులు ప‌ట్టించుకోకుండా వారినే దూషించి పంపించార‌ని వాపోయారు. దీంతో వారిపై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇవాళ బాధితులు మానవ హక్కుల క‌మిష‌న్‌ను కోరారు.

Next Story

Most Viewed