ఉదండ‘పూర్’ పరిహారం!

by  |
ఉదండ‘పూర్’ పరిహారం!
X

దిశ, మహబూబ్‌నగర్: ముంపు బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పరిహారం పరిహాసంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం కింద వివిధ గ్రామాలకు చెందిన రైతులకు ఇచ్చిన పరిహారం‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వల్లురు, ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ముంపు బాధితులకు ఇచ్చిన పరిహారంపై రైతులు నిరసన చేపట్టారు. తమ పక్కనే ఉన్న గ్రామాలకు చెందిన రైతులకు ఒక విధంగా తమకు మరో విధంగా నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం తమను మోసం చేసిందని కొందరు రైతులు అరోపిస్తున్నారు.

అప్రోచ్ ఛానల్, అండర్ టన్నెల్ కోసం

కరివెన రిజర్వాయర్ నుంచి ఉదండాపూర్ రిజర్వాయర్ మధ్యలో ఉన్న 16వ ప్యాకేజీలో భాగంగా అప్రోచ్ ఛానల్, అండర్ టన్నెల్ నిర్మించాల్సి వుంది. దీని కోసం జడ్చర్లలోని వల్లూరు, శంకరాయపల్లి, పోలేపల్లి, భూ రెడ్డిపల్లి, మల్లెబోయిన్పల్లి, బండమీదిపల్లి తదితర గ్రామాల నుంచి మొత్తం 314 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. దీనికి సంబంధించి కొన్ని గ్రామాలు అటు జాతీయ ప్రధానరహదారికి, మరికొన్ని గ్రామాలు అంతర్గత రహదారులకు ఆనుకుని ఉండగా మరి కొన్ని గ్రామాలు పోలేపల్లి సెజ్‌కు సమీపంలో ఉన్నాయి. అధికారులు ఆయా ప్రాంతాలను బట్టి ధరలను నిర్ణయించి భూములు సేకరించారు. ముంపు గ్రామాల రైతులకు అందరికీ సమానంగా పరిహారం ఇవ్వకుండా ప్రాంతాన్ని బట్టి పరిహారం నిర్ణయించడం పట్ల రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇది కాదా వివక్ష?

పోలేపల్లి, బండమీద పల్లి వంటి కొన్ని ప్రాంతాల రైతులకు రూ.12 లక్షలు పరిహారం ఇవ్వగా, ఉదండాపూర్, వల్లూరు, శంకరాయపల్లి వంటి మరి కొన్ని ప్రాంతాల రైతులకు రూ.6 లక్షలు ఇవ్వడం పట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. రిజర్వాయర్ తమ గ్రామాల్లో నిర్మిస్తూ తమకు ఇతర ప్రాంతాల రైతుల కంటే తక్కువగా పరిహారం ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రామాల పరిసర ప్రాంతాలో భూముల ధరలు బాగా పెరిగాయి. దీంతో తమకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో భూములను కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.లక్షలు ఇస్తే ప్రస్తుతం ఇక్కడ భూముల ధరలు రూ.35 లక్షల వరకు పలుకుతున్నాయనీ, ముంపు రైతులదరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వం ఇలా వ్యత్యాసాలు చూపుతోందంటున్నారు. ఇలా చేయడం వల్ల వివక్ష చూపడమే కాకుండా, రైతుల మధ్య చిచ్చుపెట్టినట్టు అవుతుందని పలువురు రైతులు అంటున్నారు. పునరావాసం‌పై కూడా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి రైతుల డిమాండ్లు

ప్రస్తుతం ఇస్తున్న ప్యాకేజీ కాకుండా ముంపు గ్రామాల రైతులకు ఎకరాకు రూ.12 లక్షలు, 300 గజాల ప్లాట్ ఇవ్వాలని, ఇండ్లు కోల్పోతున్న రైతులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఇంటికి సంబంధించి గజానికి రూ.4000ల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. నిరుద్యోగ యువతకు స్థానిక పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

tags : palamuru project, telangana state, mahabubnagar story

Next Story