కలెక్టర్ నిఖిల సడెన్ విజిట్.. అధికారులకు సీరియస్ వార్నింగ్

by  |
Collector-Nikhila-1
X

దిశ, తాండూరు: ఈ నెల చివర వరకు 100 శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలనే కార్యాచరణను చేపట్టినప్పటికీ క్షేత్ర స్థాయిలో అనుకున్నంత వేగంగా జరగకపోవడంతో జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని కన్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. వ్యాక్సినేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తనకు ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా పంపించాలని ఆధికారులను ఆదేశించారు.

అనంతరం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలోని రైస్ మిల్లు వద్ద ఉన్న రైతులతో ఆమె మాట్లాడారు. యాసంగిలో రైతులందరూ వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. రైతులు వరి పండించి నష్టపోవద్దని.. దానికి బదులు పెసర, మినుములు, నువ్వులు, వేరుశనగ, జొన్నలు లాంటివి పండించి లాభాలు పొందాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే చిరుధాన్యాలు కూడా పండించుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కలెక్టర్ వెంట తాండూరు ఆర్డీవో అశోక్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ హన్మంత్ రావు, ఎమ్మార్వో చిన్నప్పలనాయుడు, డాక్టర్ భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, వ్యవసాయ సహాయ సంచాలకులు శంకర్ రాథోడ్, మండల వ్యవసాయ అధికారి బాల కోటేశ్వర్ రావు, సైంటిస్ట్ డా. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story