భగ్గుమంటున్న బొగ్గు గని కార్మికులు

by  |
భగ్గుమంటున్న బొగ్గు గని కార్మికులు
X

దిశ, వరంగల్: కరోనా వైరస్ సింగరేణి కార్మికుల పాలిట శాపంగా మారింది. యాజమాన్యం సెలవులు ప్రకటించినప్పటికీ అత్యవసర సేవలో భాగంగా కార్మికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఓపెన్ కాస్టుల్లో కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మేరకు మార్చి వేతనాల్లో కోత విధించడం పట్ల జయశంకర్ భూపాలపల్లి ఏరియాలోని పలువురు బొగ్గు గని కార్మికులు భగ్గుమంటున్నారు. కోత విధించిన జీతంతో పాటు ఏప్రిల్ నెలకు పూర్తి వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనకు సిద్దమంటూ కార్మిక సంఘాల నాయకులు అల్టిమేటమ్ జారీ చేస్తున్నారు.

ఉత్పత్తి ఆగొద్దని…

భూపాలపల్లి సింగరేణి ఏరియాలో నాలుగు భూగర్బ, ఓపెన్ కాస్టు గనులున్నాయి. ఈ గనుల్లో 7,250 మందికి పైగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. సింగరేణిలో 9 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతది. ప్రస్తుతం సింగరేణి నాలుగు భూగర్భ గనులకు లేఆఫ్ ( విధులకు దూరంగా ఉన్న కార్మికులకు సగం వేతనం ఇచ్చే విధానం) ప్రకటించటంతో 5, 250 కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో రోజుకు 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అత్యవసర సేవలు అందించేందుకు 500 మంది కార్మికులు, ఓపెన్ కాస్ట్ లో మరో 1500 మంది విధులు నిర్వర్తిస్తూ 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. లాక్ డౌన్ తో అత్యవసర విభాగాల్లో పని చేస్తున్న వారికి పూర్తి వేతనం చెల్లించిన సింగరేణి యాజమాన్యం లేఆఫ్ లో భాగంగా విధులకు దూరంగా ఉన్న వారికి సగం వేతనం చెల్లించింది. ఈ పరిణామం కార్మికుల్లో ఆందోళనకు దారి తీసింది.

లాక్ డౌన్ తో ఇక్కట్లు..

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. మార్చి నెలలో పని చేసినప్పటికీ భూగర్భ గని కార్మికులకు సింగరేణి యాజమాన్యం ఏప్రిల్ 1న రెండో షిప్ట్ నుంచి లే ఆఫ్ ప్రకటించింది. అయినా అత్యవసర విభాగాల్లో పనిచేసే కార్మికులతో పాటుగా ఓపెన్ కాస్ట్ లో కార్మికులు యంత్రాల పై పని చేస్తూ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. లేఆఫ్ కార్మికులకు మార్చి వేతనాల్లో కోత విధించటం పట్ల సింగరేణి యాజమాన్యంపై బీఎంఎస్, ఏఐటీయూసీ, సీఐటీయూసీతో పాటు జాతీయ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. లేఆఫ్ ఎత్తివేసి పూర్తి స్థాయి వేతనాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

లే ఆఫ్ సరికాదు: కార్మిక సంఘాలు

లాక్ డౌన్ తో సింగరేణిలో లేఆఫ్ ప్రకటించటం సరికాదని కార్మిక సంఘాలు అంటున్నాయి . విద్యుత్ ఉద్యోగులు, వైద్యులు, పోలీసులకు ఇచ్చినట్టుగానే సింగరేణి కార్మికులకు కూడా పూర్తి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. భూగర్బ గనుల్లో అను నిత్యం కార్మికులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పని చేస్తుంటే సగం వేతనం ఇవ్వడాన్ని సరికాదంటున్నాయి. లే ఆఫ్ తో 60 శాతం పైగా వేతనం కోల్పోతున్నామని బాధిత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కార్మికులు, కార్మిక సంఘాల ఇష్టానుసారంగానే వేతనాల్లో కోత విధిస్తున్నామని సింగరేణి జీఎం నిరీక్షణ్ రాజ్ చెబుతున్నారు.

tags: Warangal, Singareni workers, layoff, trade unions, agitation, full salary

Next Story