సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆ నాలుగు మండలాలపై చర్చ!

by  |
cm-kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇప్పటికే హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని మరో నాలుగు మండలాలకూ విస్తరించాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సోమవారం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రానికి నాలుగు దిక్కుల ఉన్న నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా సీఎం ఎంపిక చేయడంతో ఆ జిల్లాల మంత్రులు, కలెక్టర్లు తదితరులను ఈ మీటింగుకు రావాల్సిందిగా సమాచారం పంపారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాలు దళితబంధు పైలట్ ప్రాజెక్టుకు ఎంపికయ్యాయి.

ఈ నియోజకవర్గాల్లోని దళిత కుటుంబాల సంఖ్య, వాటి జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి, దళితబంధు ద్వారా నిలదొక్కుకోడానికి ఉన్న అవకాశాలు తదితరాలన్నింటిపై ప్రగతి భవన్‌లో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మొదలయ్యే సమావేశంలో చర్చ జరగనున్నది. ఈ సమావేశానికి ఆ జిల్లాల (ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్) ఇన్‌ఛార్జి మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు హాజరుకానున్నారు.

ప్రభుత్వం తరఫున ఎస్సీ అభివృద్ధి సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆ శాఖ కార్యదర్శి రాహుల బొజ్జా, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొంటారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన దళితబంధు అమలవుతున్నందున ఫీల్డ్ స్టడీ చేసిన అనుభవం ఉన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ సమావేశంలో పాల్గొంటారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సన్నాహక సమావేశంలో చర్చించనున్నారు.

Next Story

Most Viewed