సచివాలయం డిజైన్‌పై ఎల్లుండి సీఎం సమీక్ష

by  |
సచివాలయం డిజైన్‌పై ఎల్లుండి సీఎం సమీక్ష
X

దిశ, న్యూస్‌బ్యూరో: సచివాలయం కూల్చివేత పనులు దాదాపు పూర్తికానున్న నేపథ్యంలో కొత్త సచివాలయం నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో కొత్త సచివాలయం లోపలి డిజైన్ ఎలా ఉండాలో ప్రాథమికంగా చర్చించారు. మరింత లోతుగా, కూలంకషంగా చర్చించడానికి రోడ్లు భవనాల శాఖ అధికారులతో మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి ఆర్కిటెక్ట్ డిజైనర్లు ఆస్కార్ కన్సాసెస్, పొన్ని కూడా హాజరవుతున్నారు. సచివాలయం బాహ్య రూపంపై ఇప్పటికే స్పష్టత వచ్చినా ఛాంబర్లు, సమావేశ మందిరాలు, గదులు, వివిధ శాఖల సెక్షన్లు తదితరాలపై ఆర్కిటెక్ట్ సమర్పించిన ముసాయిదా డిజైన్‌పై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలు, వాటి అధికారుల కార్యాలయాలు ఒకే భవనంలో ఉండే ఆలోచనతో సమీకృత సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నందున ఆ అవసరాలన్నింటికీ సరిపోయే తీరులో భవనం లోపలి డిజైన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖల అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వాటికి తగినట్లుగా డిజైన్‌లో తగిన మార్పులు చేర్పులు చేయడానికి వీలుగా ఈ సమావేశంలో ఆర్కిటెక్ట్‌ను కూడా ఆహ్వానించారు. ఇప్పటికే ముసాయిదా డిజైన్‌ను తయారుచేసిన ఆర్కిటెక్ట్ గాలి, వెలుతురు, పర్యావరణ పరిరక్షణ, సౌర విద్యుత్ తయారీ ప్లాంట్, ఆటోమేటిక్ కంట్రోల్ కోసం సెన్సార్లు.. ఇలాంటి సౌకర్యాలను పొందుపర్చారు.

నిర్మాణ బాధ్యతలెవరికి?

సచివాలయం బాహ్య, అంతర్ డిజైన్ల తయారీ అయిన తర్వాత స్థానిక వనరులను సమకూర్చుకుంటూ ఎంత కాలంలో నిర్మాణాన్ని పూర్తిచేయవచ్చు, ఎప్పటికల్లా సిద్ధం అయ్యే అవకాశం ఉంటుంది, ఎప్పటి నుంచి వినియోగంలోకి తీసుకురావచ్చు లాంటి అంశాలపై ఈ సమీక్ష సందర్భంగా సీఎం చర్చించనున్నారు. ఏడాది కాలంలోగా నిర్మాణాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని సీఎం భావిస్తున్నందున ఏ సంస్థకు నిర్మాణ బాధ్యతలను అప్పగించవచ్చు, టెండర్లను ఏ ప్రాతిపదికన ఆహ్వానించాలి, ఇందుకోసం ఎంత మొత్తం ఖర్చవుతుందని, నిధుల కేటాయింపు ఎలా తదితరాలన్నింటిపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

గతంలో ప్రగతి భవన్‌ను కట్టిన కాంట్రాక్టు సంస్థకే సచివాలయం నిర్మాణ బాధ్యతలను కూడా అప్పజెప్పే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. కొత్త సచివాలయానికి భూమి పూజ చేయడం మొదలు డిజైన్ ఎంపిక, కాంట్రాక్టు అప్పగింత, నిర్మాణపు పనులను మొదలుపెట్టడం, ప్రారంభోత్సవం చేయడం.. అన్నీ కూడా ఈ హయాంలోనే జరిగిపోవాలని సీఎం భావిస్తున్నట్లు అధికార పార్టీ నేత ఒకరు తెలిపారు. ఈ కారణంగానే వీలైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తేవడంపై సీఎం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed