ప్రగతిభవన్‌ టు ప్రజాదర్బార్

by  |
ప్రగతిభవన్‌ టు ప్రజాదర్బార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక ఉప ఎన్నికలోనూ, జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ వరుసగా ఓటములు చవిచూసిన అధికార పార్టీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. పరాజయానికి కారణాలేమిటో విశ్లేషించే పనిలో పడింది. ఇది బీజేపీ పట్ల జనం మొగ్గుచూపడమో లేక ‘హిందూ’ ఓటు బ్యాంకు ఆ పార్టీకి మళ్లడమో కాదని టీఆర్ఎస్ అధినేత ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రజలకు ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల వ్యతిరేకత లేకున్నా అసంతృప్తి ఉందని భావించిన కేసీఆర్ త్వరలో మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లాలనుకుంటున్నారు. ప్రజలతో నేరుగా ముచ్చటించడం ద్వారా మాత్రమే అసలు నిజాలు తెలుస్తాయని అనుకుంటున్నారని తెలిసింది.

ప్రగతిభవన్‌లో ప్రజల కోసం ఇకపైన దర్బార్ నిర్వహించడం ఉత్తమమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భావిస్తున్నారని తెలిసింది. వీలైనంత త్వరగా పాలనను ప్రక్షాళన చేసి పెను మార్పులు చేయాలని అను కుంటున్నారు. అందులో భాగంగా ప్రజలకు భారంగా పరిణమించిన ఎల్ఆర్ఎస్‌పై స్వయంగా వివరణ ఇచ్చి తగిన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే ఇన్ని సీట్లు కూడా వచ్చేవి కావని, ‘హిందూ’ వేవ్ ఉన్నా బీజేపీకి ఇంతకంటే ఎక్కువ సీట్లే వచ్చేవని సీఎం సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితులను తక్షణం చక్కదిద్దుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి పార్టీపరంగా, ప్రభుత్వపరంగా భారీ స్థాయిలోనే మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రజల సమస్యలను, అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పటిష్ట మెకానిజాన్ని రూపొందించాలని సీఎం భావిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు మొదలు ముఖ్యమంత్రి వరకు ప్రజలు ఎప్పుడైనా కలిసే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు. ప్రగతిభవన్‌లో ప్రజాదర్బార్ లాంటి విధానాన్ని తేవాలనుకుంటున్నారు. జిల్లాలలోనూ, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇదే విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ప్రజలు ఏయే అంశాలలో అసంతృప్తితో ఉన్నారో తెలుసుకుని, వాటిని సరిచేసి, తిరిగి వారి విశ్వాసాన్ని చూరగొనేలా, సంతృప్తి కలిగేలా వ్యవహరించడం తక్షణావసరం అనే అభిప్రాయంతో సీఎం ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, మంత్రులే కాకుండా ముఖ్యమంత్రిగా తాను కూడా ఇకపైన ప్రజల మధ్యకు వెళ్లాలని సూత్రప్రాయంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సందర్భాలకు అనుగుణంగా ప్రజల మధ్యకు వెళ్లడం, ప్రజలతో ముఖ్యమంత్రికి సంబంధాలు ఏర్పడడం లాంటివాటిపై సన్నిహితులతో చర్చించినట్లు తెలిసింది.

ఎల్ఆర్ఎస్‌తో మొదలు?

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ లాంటి నిర్ణయం తీసుకోవడం ప్రజలకు జీర్ణం కాలేదని సీఎం భావిస్తున్నారని సమాచారం. ఇది ప్రభుత్వ తొందరపాటు చర్యేనన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. కరోనా కష్టకాలంలో ఎల్ఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం, అది ప్రజల్లో కలిగించిన అభిప్రాయం, ఓటింగ్‌లో చూపించిన ప్రభావాన్ని మరింత లోతుగా చర్చించి స్వయంగా ముఖ్యమంత్రే ప్రజల్లోకి వెళ్లి దాని గురించి వివరించాలనుకుంటున్నట్లు తెలిసింది. ప్రజలతో సంభాషించిన తర్వాత వారి నుంచి వెలువడే అభిప్రాయాలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్‌ను ఎత్తివేయడమా, వాయిదా వేయడమా, గడువు ఇవ్వడమా? అనే అంశాల మీద నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నందున దానికి కూడా తగిన వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

‘హిందూ’ వేవ్‌పై చర్చ..

జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ హిందూ మతం అంశాన్ని ప్రచారంలోకి తేవడం కొందరిలో కదలిక తీసుకొచ్చినా, మొత్తానికే ఒక వేవ్‌లాగా మారిందని సీఎం భావించడం లేదని సమాచారం. నిజంగా ఆ వేవ్ ఉంటే ఆ పార్టీ ఓట్ల శాతం లేదా సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉండేదని, అలా జరగలేదని వాదించినట్లు తెలిసింది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా టీఆర్ఎస్‌కు సీట్లు బాగా తగ్గిపోయేవని స్పష్టం చేశారని అంటున్నారు. ప్రజలలో కొంత అసంతృప్తి ఉన్నందునే ప్రత్యామ్నాయంవైపు మళ్లారని, నిజంగా ఆ పార్టీనే కోరుకున్నట్లయితే వన్‌సైడ్‌గా దాన్నే గెలిపించి ఉండేవారని సీనియర్లతో చర్చ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

తెలంగాణ సమాజ స్వభావం, ప్రజల ఆలోచన ఒక మతంవైపు మూర్ఖంగా కొట్టుకుపోయేంత బలహీనంగా లేదని నొక్కి చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఏయే అంశాలలో ఏ స్థాయిలో ఉందో విశ్లేషించి దాన్ని చక్కదిద్దడం మినహా మరో మార్గం లేదని అన్నట్టు సమాచారం. అందులో భాగంగానే ప్రజలలో పార్టీ, ప్రభుత్వం సజీవంగా, నిరంతరం ఉండేలా చేయడం ఉత్తమమన్న భావనకు వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే దీనికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందే అవకాశం ఉంది. మరోవైపు పాలనలో ప్రక్షాళన సందర్భంగా ఇప్పటికిప్పుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమో లేక కవితను మంత్రివర్గంలో చేర్చుకోవడమో ఉండకపోవచ్చన్న సంకేతాలను కూడా సీఎం సన్నిహితుల దగ్గర ప్రస్తావించారని తెలిసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed