పాలమూరు పొలాలను తడపాలంటే.. ఆ పని చేయాల్సిందే..!

by  |
పాలమూరు పొలాలను తడపాలంటే.. ఆ పని చేయాల్సిందే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పచ్చబడాలన్నా, నిరంతరం సస్యశ్యామలతో కళకళలాడాలనా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఇటు కల్వకుర్తితో, అటు జూరాలతో అనుసంధానం చేయాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలను, కార్యాచరణ ప్లాన్‌ను సిద్ధం చేయాలని సాగునీటిపారుదల అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పాలమూరు జిల్లాలోని పలు ప్రాజెక్టులపై ప్రగతి భవన్‌లో సోమవారం సమీక్షించిన సందర్భంగా డిజిటల్ మ్యాప్‌పై అధికారులకు అర్థం చేయించారు. కల్వకుర్తితో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అనుసంధానించడం ద్వారా తాండూరు, వికారాబాద్ లాంటి ప్రాంతాలకు గ్రావిటీ ద్వారానే నీటిని అందించవచ్చని తెలిపారు. ఇక జూరాలతో అనుసంధానం చేయడం ద్వారా రిజర్వాయర్‌లోకి సహజంగా చేరిన నీరు, రీ-జనరేటెడ్ వాటర్, కెనాల్ సంవత్సరం పొడవునా నీటితో కళకళలాడుతుందన్నారు. అదే సమయంలో జూరాల పరిధిలోని 24 మున్సిపాలిటీలు, గ్రామాలకు తాగునీటితో పాటు పరిశ్రమలకు కూడా నీరందించే వెసులుబాటు కలుగుతుందన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రతీ ఎకరాన్ని కృష్ణా జలాలతో తడపాలంటే ఈ ప్రాజెక్టుల అనుసంధానం అనివార్యమన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి మరింతగా విస్తరించాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి తగిన ప్రణాళికలను, అనుసరించాల్సిన కార్యాచరణను అధికారులకు ఈ జిల్లాల ప్రజా ప్రతినిధులకు వివరించారు. కృష్ణా నదీ ప్రవాహం అక్టోబర్ నెల వరకే ఉంటుందని, ఈలోపు చట్టబద్ధంగా లభించిన వాటాను వీలైనంతగా ఎత్తిపోసుకొని ఎండిన బీళ్లను తడుపుకోవాలన్నారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉన్నందున ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసుకుంటున్న రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉంటుందని, ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని ఇవ్వడం కష్టమని కేసీఆర్ పేర్కొన్నారు. కల్వకుర్తి లిఫ్టు ఆయకట్టును పూర్తిస్థాయిలో స్థిరీకరించేందుకు పాలమూరు లిఫ్టు పనులను వేగవంతంగా కొనసాగించి, ఎక్కడికక్కడే వీటిని అనుసంధానించుకోవాలన్నారు. అందులో భాగంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్‌ను నింపుకొని కొడంగల్, నారాయణ పేట్, పరిగి, తాండూర్, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల పరిధిలో సాగుభూములకు గ్రావిటీ ద్వారా నీరందించే అవకాశం ఉంటుందని డిజిటల్ స్క్రీన్‌పై మ్యాపుల ద్వారా వివరించారు. ప్రధాన కాలువల నిర్మాణం సహా, చెరువులన్నింటినీ నింపే ప్రణాళికలను రూపొందించాలన్నారు.

దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని భూత్‌పూర్, ఘన్‌పూర్, మూసాపేట, అడ్డకల్ మండలాల్లో తాగునీటిని తీసుకెళ్లే మార్గాలను డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శించారు. కాళేశ్వరం పనులు పూర్తయినందున ఇక నుంచి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని నొక్కిచెప్పారు. ప్రతీవారం క్షేత్రస్థాయి పర్యటనలు కూడా జరపాలని స్పష్టంచేశారు. ఇక నుంచి పర్యటనలు మొదలవుతున్నందున అనువైన చోట ఒక గెస్టు హౌజ్ ను నిర్మించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లోని వేగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

అచ్చంపేట లిఫ్టు ఇరిగేషన్ స్కీం సర్వే పనులను సత్వరమే పూర్తిచేసి, అంచనా వ్యయ వివరాలను పరిపాలనా అనుమతుల కోసం పంపాల్సిందిగా సూచించారు. బల్మూర్, లింగాల అమ్రాబాద్ ప్రాంతంలో 60 వేల ఎకరాలకు సాగునీరందించాలని, ఇందుకోసం ఏదుల రిజర్వాయర్ నుంచి 22 కి.మీ. మేర కాల్వ తీసి, లింగాల దగ్గర లిఫ్టును ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడినుంచి మైలారం దగ్గర మూడు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ను ఏర్పాటు చేసి దానికి ఉమామహేశ్వరం పేరు పెట్టాలన్నారు. అక్కడినుంచి చంద్రసాగర్‌కు కాల్వ ద్వారా నీరందించి, అమ్రాబాద్ మండలంలోని మున్ననూరులో 1.4 టీఎంసీ సామర్థ్యంతో చేన్నకేశవ పేరుతో ఒక రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని, మే నెలలో శంకుస్థాపన చేసుకుందామన్నారు.

కోయిల్ సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడానికి గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణ పనులను, తుమ్మిళ్ల లిఫ్టు దగ్గర పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. గట్టు రిజర్వాయర్‌ను మూడు టీఎంసీల సామర్థ్యానికి పెంచాలన్నారు. జూరాల మీద ఆధారపడిన నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, జూరాల సొంత ఆయకట్టుతోపాటు, మిషన్ భగీరథకు నిరంతరం నీరందించే బరువంతా జూరాలపైనే ఉన్నందున అక్కడ నీటి లభ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.



Next Story

Most Viewed