జల వివాదంపై కేసీఆర్ మాస్టర్ స్కెచ్.. చిక్కుల్లో ఆ పార్టీలు

by  |
Chief--Minister-KCR,-Krishn
X

దిశ, తెలంగాణ బ్యూరో: అనూహ్యంగా కృష్ణా జలాల వివాదం తెరపైకి రావడం అనేక అనుమానాలకు ఆస్కారం కల్పించింది. ఈ వ్యవహారం వెనక బలమైన రాజకీయ వ్యూహమే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. విపక్షాల నేతలు కూడా దీన్నే నొక్కి చెప్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ జాతీయ పార్టీలను కార్నర్ చేయడానికి ఇద్దరు సీఎంలూ ఆసక్తికరంగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలే ఏకైక ఎజెండాగా ఉంటాయి. కానీ జాతీయ పార్టీలకు అంతకంటే విస్తృత పరిధి ఉంటున్నందున స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతాయన్న బలహీనతే ఇటు టీఆర్ఎస్, అటు వైఎస్సారీసీపీలకు కలసి వస్తున్న అంశం. కృష్ణా జలాల అంశంలో ఏకకాలంలో ఈ రెండు జాతీయ పార్టీలనూ టార్గెట్ చేయాలన్నది ఈ రెండు ప్రాంతీయ పార్టీల వ్యూహం.

మాస్టర్ ​ప్లాన్

ప్రాంతీయ పార్టీలు పట్టు నిలుపుకోవాలంటే జాతీయ పార్టీలను ఎటూ తేల్చుకోలేని విధంగా చేయాలని మాస్టర్ ప్లాన్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటివరకూ కృష్ణా జలాల అంశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నేతలు తప్ప బీజేపీ ఒక పార్టీగా తన వైఖరిని వెల్లడించలేదు. కాంగ్రెస్ పార్టీలో సైతం అదే జిల్లాకు చెందిన నేతలు మాత్రమే పాదయాత్ర పేరుతో రోడ్లమీదకు వచ్చారు. తాజాగా పీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఆరోపణలకు మాత్రమే పరిమితమై వైఎస్సార్‌పైన మాటల దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కానీ కృష్ణా జలాల విషయంలో ఈ రెండు జాతీయ పార్టీలూ వాటి వైఖరిని మాత్రం వెల్లడించలేదు. ఆ రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసుకోవడం లేదా కనీసంగా ఉనికిలో ఉంచుకోవడం అనివార్యమైనందున నిర్దిష్ట వైఖరి వెల్లడిస్తే అసలుకే ఎసరొస్తుందనేది వాటి భయం.

జాతీయ పార్టీలుగా వాటి వైఖరిని వెల్లడించడంలో ఉన్న రాజకీయ ఇబ్బందులతో పాటు ఒక పార్టీకి రెండు రాష్ట్రాలకు వేర్వేరు వైఖరులు ఎలా ఉంటాయని ప్రాంతీయ పార్టీలు మరో వివాదాన్ని సృష్టించే ప్రమాదమూ లేకపోలేదు. ఏ ఒక్క రాష్ట్రాన్ని సమర్ధించినా మరో రాష్ట్రంలో రాజకీయంగా దెబ్బ తగులుతుందనేది జాతీయ పార్టీల భయం. అందుకే కాంగ్రెస్, బీజేపీలు ఆచితూచి వ్యవహరించాల్సి వస్తున్నది. సరిగ్గా ఈ అంశమే ప్రాంతీయ పార్టీలకు వరంగా మారింది. అందుకే రెండు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ఎక్కడా అడుగు వెనక్కి తగ్గడంలేదు. మాటల యుద్ధంతో మొదలై చివరకు సరిహద్దు డ్యామ్‌ల దగ్గర పోలీసు బలగాల మోహరింపు వరకు రోజురోజుకూ వేడిని పెంచుతున్నాయి.

ఇద్దరు సీఎంల సమిష్టి డ్రామా

హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే తెలంగాణలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కృష్ణా జలాల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలా తగవును నెత్తికెత్తుకుంటున్నామని ఎంపీ రఘరామ కృష్ణరాజు ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులను నిర్మించే పెద్ద కంపెనీ ఒక్కటేనని, రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలతో పరిష్కరించాలని, రాజకీయ అవసరాల కోసం వివాదాన్ని పెద్దది చేయవద్దని రఘరామ సూచించారు. ఇక తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్తున్నారు. రాజకీయ ప్రయోజనం తప్ప ఇందులో మరో అంశమే లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘బేసిన్‌లు లేవు.. భేషజాలు లేవు..’ అంటూ జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి మాట్లాడించిన రోజునే ఏపీ నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టులకు తెలంగాణ సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, ఆ తర్వాతనే ఆ రాష్ట్రం జీవోను తయారుచేసిందని రేవంత్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇద్దరు సీఎంల ఉమ్మడి ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన ఈ వ్యవహారం సమిష్టిగా ఆడిస్తున్న డ్రామాగా అభివర్ణించారు.

రేవంత్‌కు సంకట స్థితి

తెలంగాణకు కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సమర్ధించక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. దీన్ని బహిరంగంగా వ్యాఖ్యానించినట్లయితే పరోక్షంగా సీఎం కేసీఆర్ లేవనెత్తిన వాదనను బలపరిచినట్లవుతుంది. ఒకవేళ వ్యతిరేకిస్తే తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు ఇబ్బందులు ఏర్పడతాయి. పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నందున ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. దీనికి తోడు ఇప్పుడు పూర్తిగా తెలంగాణ పక్షమే వహించినట్లయితే ఆ పార్టీకి చెందిన ఏపీ పీసీసీ చీఫ్ నుంచి వ్యతిరేక ప్రకటనలు వస్తాయి. ఇది మరో రకంగా ఆ పార్టీకి సంకటంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోణం నుంచి స్పష్టమైన ప్రకటన చేయడం రేవంత్‌రెడ్డికి సవాలుగా మారింది.

తెలంగాణ బీజేపీ మౌనం

తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ ఇప్పటివరకు కృష్ణా జలాల విషయంలో తెలంగాణ లేవనెత్తిన అంశంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆరేళ్ళ కిందట వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే సమస్యను పరిష్కరిస్తామంటూ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గతేడాది అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా హామీ ఇవ్వడంతో కేసీఆర్ ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇకపై పరిష్కరించాల్సింది కేంద్ర మంత్రే అంటూ చెప్పుకోడానికి అస్త్రం దొరికినట్లయింది. ఆ విధంగా బీజేపీని టార్గెట్ చేయడం టీఆర్స్‌కు సులువైంది.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీకి దీటుగా ఎదగాలనుకుంటున్నందున ఆ రాష్ట్ర బీజేపీ ఒక రాజకీయ ప్రయోజనం కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెచ్చి వివాదం చేస్తున్నదని వ్యాఖ్యానించింది. కానీ తెలంగాణ బీజేపీ మాత్రం స్పష్టమైన వైఖరిని వెల్లడించలేకపోతున్నది. తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయమే జరిగిందని కామెంట్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చినట్లవుతుంది. ఒకే పార్టీ రెండు రకాల వైఖరులను ప్రదర్శిస్తున్నదంటూ కౌంటర్ చేయడానికి ప్రాంతీయ పార్టీలకు అవకాశం కల్పించినట్లవుతుంది. సరిగ్గా జాతీయ పార్టీల ఈ బలహీనతే ఏపీలో వైఎస్సార్సీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కు బలమైన అవకాశం లభించినట్లయింది.

Next Story

Most Viewed