సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వరాలు కురిపించిన సీఎం

by  |
Singareni
X

దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణి ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతూ బోర్డు ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలపై సింగరేణి సీఎండీ శ్రీధర్ సోమవారం 557వ బోర్డు డైరెక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు. గతంలో ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్ల ఉండగా 61 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 31 నుంచి ఉద్యోగులకు దీనిని అమలు చేయనున్నారు. దీనివల్ల సింగరేణి కార్మికులు, అధికారులు కలిపి మొత్తం 43,899 మందికి లబ్ధి చేకూరనుంది.

మార్చి 31వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్యకాలంలో రిటైర్డ్ అయిన 39 మంది అధికారులు, 689 మంది కార్మికులను కూడా తిరిగి విధుల్లోకి తీసుకొనున్నారు. దీనిపై సమగ్రమైన విధివిధానాలు రూపొందించాలని సీఎండీ శ్రీధర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

పెళ్లైన మహిళలూ అర్హులే..

ఇదిలా ఉండగా కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇప్పటివరకు కేవలం కుమారులకు, అవివాహిత కుమార్తెలకు మాత్రమే అవకాశం కల్పిస్తూ ఉండగా.., కార్మికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు పెళ్లయిన, విడాకులు తీసుకుని విశ్రాంత ఉద్యోగిపై ఆధారపడి ఉన్న కుమార్తెలు, ఒంటరి మహిళలకు కూడా ఉద్యోగ వయోపరిమితికి లోబడి వారసత్వ ఉద్యోగం పొందేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. సామాజిక బాధ్యత కార్యక్రమాల నిర్వహణకు వచ్చే ఏడాదికి గాను రూ.60 కోట్లు కేటాయించింది.

రామగుండంలో కొత్తగా ప్రారంభించనున్న ఆర్.జీ ఓపెన్ కాస్ట్-5 కు సంబంధించి రెండు కొత్త రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ కాలనీ వద్ద జాతీయ రహదారి విస్తరణలో నిర్వాసితులైన స్థానికులకు సింగరేణి కాలనీలో 85 చదరపు గజాల విస్తీర్ణం గల 201 ప్లాట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర బొగ్గు శాఖ డైరెక్టర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed