అంచనాలు తలకిందులు.. స్నేహితుడికి ఎమ్మెల్సీ కట్టబెట్టిన కేసీఆర్

by  |
అంచనాలు తలకిందులు.. స్నేహితుడికి ఎమ్మెల్సీ కట్టబెట్టిన కేసీఆర్
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: అవ‌కాశం-అదృష్టం- అధినేత క‌రుణ క‌ల‌గ‌లిపిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణం మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారిని గ‌వ‌ర్నర్ కోటాలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీని చేసేశాయి. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మధుసూదనాచారికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనచారి పేరును ప్రతిపాదిస్తూ రాజ్‌భవన్‌కు ఫైలును పంపించ‌డం గవర్నర్ తమిళిసై ఇందుకు ఆమోదం తెల‌ప‌డం చ‌క‌చ‌కా అయిపోయాయి. వాస్తవానికి గతంలో పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రభుత్వం ప్రతిపాదించ‌గా గవర్నర్ ఆమోదించ‌లేదు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మధుసూదనాచారికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం క‌ల్పించారు.

CM KCR, Madhusudhana Chary

కేసీఆర్ ఆత్మీయ‌తే అవ‌కాశంగా మారి

రాజ‌కీయాల‌కు అతీతంగా కేసీఆర్‌-మ‌ధుసూద‌నాచారిలు ఇద్దరు ఆప్తమిత్రులు. కేసీఆర్‌తో మ‌ధుసూద‌నాచారికి సుదీర్ఘకాలంగా సాన్నిహిత్యం ఉంది. మ‌లివిడ‌త‌ తెలంగాణ ఉద్యమం ఆరంభం నుంచి కేసీఆర్‌తో క‌లిసి మ‌ధుసూద‌నాచారి ప‌నిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి వ్యవ‌స్థాప‌కుల్లో ఆయ‌నొక‌రు. వ్యవ‌స్థాప‌కుల్లో ఇప్పుడు కేసీఆర్‌తో పాటే ఉన్న అతికొద్దిమందిలో మ‌ధుసూద‌నాచారి ఉండ‌టం గ‌మ‌నార్హం. కేసీఆర్‌కు అత్యంత విశ్వాసం ఉన్న వ్యక్తిగా పార్టీ వ‌ర్గాల్లో అభిప్రాయం నెల‌కొని ఉంది. 2014 ఎన్నిక‌ల్లో భూపాల‌ప‌ల్లి నుంచి విజ‌యం సాధించిన మ‌ధుసూద‌నాచారికి అసెంబ్లీ స్పీక‌ర్‌గా నియ‌మించి కేసీఆర్ ఆయ‌న‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి మధుసూదనాచారికి ఏ రాజ‌కీయ పదవి దక్కక‌పోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఎమ్మెల్సీగా కేసీఆర్ ఆయనకు అవకాశం కల్పించ‌డంతో ఆయ‌న అభిమానుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.

చారి సార్ నేప‌థ్యం ఇదే..

సిరికొండ మధుసూధనా చారి వరంగల్‌ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లిలో 1956, అక్టోబరు 13న జన్మించారు. కాకతీయ యూనివర్శిటీ నుంచి ఎంఏ(ఇంగ్లీష్‌) పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. టీడీపీలో జాయిన‌య్యి 1994-99 మధ్యకాలంలో శాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఎన్టీఆర్ మరణానంతరం తలెత్తిన విభేదాలతో లక్ష్మీపార్వతి స్థాపించిన అన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంత‌రం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న స్నేహంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ వ్యవ‌స్థాప‌కుల్లో మ‌ధు సూద‌నాచారి కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. 2014లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీక‌ర్‌గా బాధ్యత‌లు నిర్వహించి అభిమానం చూర‌గొన్నారు.

Next Story