చంద్రబాబు, వైఎస్ బాటలో సీఎం కేసీఆర్

by  |
చంద్రబాబు, వైఎస్ బాటలో సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో భూములను అమ్మేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏ ఇతర రాష్ట్రంలో డబ్బుల కోసం ప్రభుత్వ స్థలాలను విక్రయించిన దాఖలాలు లేవు. ప్రజాప్రయోజనాల కోసం వినియోగించారే తప్ప ప్రైవేటు కంపెనీలకు ధారదత్తం చేసేందుకు పూనుకోలేదన్న చర్చ జరుగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో వెయ్యెకరాలను లక్ష్యంగా పెట్టుకొని కార్యరంగంలోకి దిగారు. మిగులు బడ్జెట్​తో ఏర్పడిన రాష్ట్రానికి భూములను అమ్ముకోవాల్సిన దుస్థితి ఎందుకు తలెత్తిందన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏదైనా ప్రాజెక్టు కట్టడానికో, పేదలకు ఇండ్లు కట్టేందుకో.. ఏ ఇతర ప్రజా ప్రయోజనాల కోసం స్థలాలను వినియోగించొచ్చు. కానీ ఏకంగా బహిరంగ మార్కెట్​లో వేలం వేయాలన్న పథక రచనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఇక్కడి భూములను అమ్మి సీమాంధ్రను అభివృద్ధి పనులకు వినియోగించారంటూ అప్పటి ముఖ్యమంత్రులపై తెలంగాణ ఉద్యమకాలంలో మండిపడిన ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్ ఈ నిర్ణయానికి రావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోలేమన్న బూచీని చూపించిన అప్పటి సీఎం చంద్రబాబునాయుడు క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాల కోసం హైదరబాద్ శివార్లలోని భూములతో పాటు, మిగతా నగరాల్లోని ప్రభుత్వ భూములను అమ్మారు. ఈ భూముల అమ్మకం ద్వారా నాటి సర్కారుకు రూ.వేల కోట్లు వచ్చాయి. ఈ డబ్బును సీమాంధ్ర ప్రాంత సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల కోసమే అత్యధికం ఖర్చు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇక్కడి భూములను తెగనమ్మారంటూ ఉద్యమకారులంతా మండిపడ్డారు. ఆ తర్వాత కే రోషయ్య, కిరణ్​కుమార్​రెడ్డిల పైనా అవే విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ భూ పందేరం ఆగలేదు. ఇప్పటికీ వారి బాటనే నేటి పాలకులు నడుస్తుండడం పట్ల జనం విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వ ఖజానా నిండాలంటే ఇదొక్కటే మార్గమా? మరేఇతర అవకాశాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని విమర్శిస్తున్నారు. కనీసం చంద్రబాబు ఆరంభించిన భూముల క్రమబద్ధీకరణే బాగుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆక్రమించుకున్న వాటికి మాత్రమే హక్కులు కల్పించారు. ఇప్పుడేమో ప్రధాన ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు కంపెనీలకు ధారదత్తం చేసేందుకు పూనుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. నిరర్ధక భూములంటూ వేలం వేసి సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ తాజాగా వేలం వేసేందుకు ప్రకటించిన కోకాపేటలోని భూములు నిరర్ధక ఆస్తులెలా అవుతాయన్న సందేహం కలుగుతోంది. ఎకరం రూ.60 కోట్ల పైమాటే పలికే అత్యంత ఖరీదైన భూములు ప్రజాప్రయోజనాల కోసం పనికి రానివిగా పరిగణించడం పట్ల అనుమానాలు కలుగుతున్నాయి.

నాడు వద్దు.. నేడు ముద్దు

తెలంగాణలో సర్కారు స్థలాలను కబ్జా చేసిన వారికి హక్కులను కట్టబెట్టింది చంద్రబాబునాయుడే. అక్రమాలకు చట్టబద్ధత కల్పించే ఉత్తర్వులు జారీ చేసింది వారే. 1995 నుంచే కబ్జాకు గురైన స్థలాలను క్రమబద్ధీకరించే ప్రక్రియను ఆరంభించారు. ఒకటా రెండా.. ప్రభుత్వ, యూఎల్సీ, సర్‌ప్లస్‌ వంటి అన్ని రకాల భూములనూ అమ్మేశారు. పేదల ముసుగులో ఎవరు అగ్గువ ధరకు పట్టాలు పొందారో పరిశీలన చేస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. 508, 674, 1606, 455, 1601, 615, 747.. ఇవన్నీ కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించే ఉత్తర్వులే. చంద్రబాబునాయుడు హయాంలోనే జారీ అయ్యాయి. ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జీఓ నెం.166 అక్రమార్కుల పాలిట వరమైంది. ఈ ఉత్తర్వులతోనే వేల దరఖాస్తులు, వేలల్లో వివాదాలు చుట్టుముట్టాయి. అదే స్థాయిలో వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలు కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాయి.

ఏపీఐఐసీ పేరిట రూ.వేల కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టారంటూ ఉద్యమించిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నేతలు, బడాపారిశ్రామిక వేత్తలు, బ్యూరోక్రాట్లు, సినీ ప్రముఖుల ఆడిన దోబూచులాటగా చిత్రీకరించారు. అక్రమ సంపాదనలతో బినామీ పేర్లతో తెరిచిన కంపెనీలే అగ్గువ ధరకు భూములు పొందాయన్న ఆరోపణలతో తెలంగాణ ఉద్యమం సాగింది. ఐఎంజీ, ఎమ్మాఆర్‌, రహేజా, వాన్‌పిక్‌ వంటి ప్రముఖమైన పేర్లతో సాగిన దందా అంతా ఇంతా కాదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు మొదలు చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్‌ల భాగస్వామ్యం ఉందన్న అప్పట్లో ఎన్నెన్నో వార్తలు వెలువడ్డాయి. తెలంగాణలో భూ అక్రమాలకు తావు లేకుండా చేసి ఆదర్శంగా నిలిపినప్పుడే పారిశ్రామికాభివృద్ధి సాధ్యం, పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం నెలకొంటుందన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఆన్‌ ల్యాండ్‌ చైర్మన్‌ ఎస్‌కే సిన్హా వంటి అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదికలిచ్చారు. అలాంటి నిపుణుల సూచనలను అమలు చేసే దిశలో ప్రభుత్వం అడుగులు మాత్రం వేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వైఎస్‌ హయాంలో దందా

2004 తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీఓ నెం.166ను తీసుకొచ్చారు. 250 గజాలు, 500 గజాలకు పైగా ఉన్న స్థలాలను రెగ్యులరైజ్‌ చేశారు. తెలంగాణలో జీఓ నెం.166 కింద క్రమబద్ధీకరణకు 1,44,348 దరఖాస్తులొచ్చాయి. వాటిలో 80 గజాల లోపు ఉన్న దరఖాస్తులు 74,747.. 81 నుంచి 250 గజాల లోపు స్థలాల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 50,232, అలాగే 251 నుంచి 500 గజాల లోపు ఉన్న దరఖాస్తులు 13,692, 501 నుంచి 2000 గజాల దాకా ఉన్నవి 5677గా ఉన్నాయి. వీటిలో మొత్తంగా 13,628 దరఖాస్తులను పరిష్కరించి క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరించే దందాను కూడా వైఎస్‌ మొదలుపెట్టారు. దీని కోసం ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ పథకాలు కూడా వైఎస్‌ హయాంలో పెద్ద దందాను నడిపించాయి. 1995 అక్టోబరు 20న జీఓ నెం.508, 2003 ఏప్రిల్​19న జీఓ నెం.515లను జారీ చేశారు. మళ్లీ జీఓ నెం.455, 456లను తేదీ.29-07-2002, జీఓ నెం.183ని 15-02-2006న, జీఓ నెం.603ను 22-04-2008ని జారీ చేశారు. జీఓ నెం.615ను తేదీ.26-04-2008, జీఓ నెం.747ను తేదీ.18-06-2008న జారీ చేశారు. వైఎస్​అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే 2005 ఆగస్టు 29న జీఓ నెం.1601 ద్వారా మొదలు పెట్టారు. ఇండస్ట్రీయల్‌ స్థలాలకు అవకాశం ఇచ్చారు. ఓ అడుగు ముందుకేసి 501 నుంచి 1000 గజాల వరకు రిజిస్ట్రేషన్‌ ధరలో 50 శాతానికే కట్టబెట్టారు. 1001 గజాలకు పైగా ఉన్న వాటికి మాత్రమే అప్పటి రిజిస్ట్రేషన్‌ ధరలో క్రమబద్ధీకరించారు. పరిశ్రమలకు కూడా 500 గజాల వరకు 2003 నాటి రిజిస్ట్రేషన్‌ ప్రకారం, 501 నుంచి 1000 గజాల వరకు అప్పటి రిజిస్ట్రేషన్‌ విలువలో 75 శాతానికి, 1001 గజాలకు పైగా ఉండే స్థలాలకు మాత్రం రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా చేపట్టారు. దీని ద్వారా ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది. ఏడాది తిరగక ముందే 2006 జూన్‌ 8న జీఓ 674 వచ్చింది. అంతకు ముందు ధరల ప్రకారమే రెగ్యులరైజ్‌ చేశారు.

తాజాగా వేలం పాటలే..

చంద్రబాబునాయుడు, వైఎస్​రాజశేఖర్​రెడ్డిల బాటలోనే సీఎం కేసీఆర్​నడుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు క్రమబద్ధీకరణ పేరిట ప్రభుత్వ స్థలాలను ప్రైవేటుపరం చేశారు. ఇప్పుడేమో ఏకంగా బహిరంగ వేలం పాటల ద్వారా హక్కులు కట్టబెడుతున్నారని రెవెన్యూ చట్టాల నిపుణుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూములపై వ్యాపారం చేయొచ్చునా? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనైనా విస్తృత ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు. డబ్బులు కావాలని రూల్​ఆఫ్ లా ను వారికి అనుగుణంగా మలుచుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు, వైఎస్​హయాంలో చేపట్టిన ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యమ నాయకులే తిరిగి కొనసాగించడం విడ్డూరంగా ఉందన్నారు. కర్నాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వ స్థలాలను లే అవుట్లుగా మారుస్తున్నారు. అక్కడే ఇండ్లు కట్టి వారికి ఇస్తున్నారు. ఇక్కడేమో ఔట్​రైట్​సేల్​చేస్తుండడంతో భావితరాల భవిష్యత్తు ఏమిటన్న సందేహం కలుగుతుందన్నారు.

అంటే ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పరిశ్రమలకు అనుకూలమని గుర్తించిన భూములు 2,09,908 ఎకరాలు, సాగుకు పనికి రాకుండా ఉన్నది 21,21,031 ఎకరాలన్న మాట.. ఈ వివరాలన్నీ ఏపీఐఐసీ ద్వారా సేకరించినవే. ఇప్పడు ఈ భూముల్లో ఎన్ని ప్రైవేటుపరమయ్యాయో, ఎంత ఆదాయం సమకూరిందో టీఎస్ఐఐసీ అధికారులకే తెలియాలి.


Next Story

Most Viewed