ఇరిగేషన్.. మనకు 'లైఫ్ లైన్' : కేసీఆర్

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు అందిస్తున్నదని, అదే స్ఫూర్తిగా రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణకు ఇరిగేషన్ ఒక ‘లైఫ్‌లైన్’ అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల ద్వారా పొలాలకు నిరంతరం నీరు పారుతున్నందున సాగునీటి వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. ఇందుకోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (అమలు-నిర్వహణ) ప్రత్యేక మెకానిజంగానే ఉండాలన్నారు. ప్రగతి భవన్‌లో సాగునీటిపారుదలపై బుధవారం జరిగిన సుదీర్ఘ సమావేశం సందర్భంగా కేసీఆర్ ఆ శాఖ ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అవసరమే ఇంజినీర్ల ప్రావీణ్యాన్ని మెరుగుపర్చిందని, ఇరిగేషన్ ప్రాధాన్యత తెలిసిందన్నారు. క్రింది స్థాయి ఇంజనీర్ వరకూ ఇరిగేషన్ వ్యవస్థపై మరింత కమాండ్ రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఓ అండ్ ఎం’లో భాగంగా ప్రాజెక్టులు, బ్యారేజీల మొదలు చివరి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వరకు, నదుల నుంచి చివరి ఆయకట్టు దాకా నీటిని తీసుకెళ్లేవరకు అన్ని వ్యవస్థలనూ పటిష్ట పరుచుకోవాలన్నారు. మరమ్మత్తులు అవసరమైతే రెండు పంటల నడుమ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టుకుంటున్నప్పుడు నిరంతరం అప్రమత్తతో ఉండాలన్నారు.

‘సమైక్య’లో హేళన.. స్వరాష్ట్రంలో కీర్తన

పంటలే పండవంటూ తెలంగాణను తక్కువచేసి చూసిన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నేడు వరిపంట సాగులో మూడో స్థానంలో వున్నదని, యాసంగిలోనూ 52 లక్షల ఎకరాల్లో సాగుతో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఓ అండ్ ఎం కోసం ప్రత్యేక అధికారులను నియమించుకుందామని, ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించుకుందాం అని భరోసా కల్పించారు. ప్రతీ సాగునీటి కాల్వ సర్కారు తుమ్మలు చెత్తా చెదారం లేకుండా అద్దంలా మెరువాలని నొక్కిచెప్పారు. తెలంగాణకు వ్యవసాయమే మొదటి ప్రాధాన్యతారంగం అయినందున స్పష్టమన దారి పడాలని, ఇందుకోసం ఇంజనీర్ల దగ్గరే నిధులను అందుబాటులో ఉంచినట్లు గుర్తుచేశారు. రైతన్నకు సాగునీటి కష్టాలు ఏ కోణంలోనూ ఎదురుకాకూడదన్నదే తన ఉద్దేశ్యమన్నారు. హైదరాబాద్‌లోనే చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్ల స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహించుకోవాలని, క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజనీర్లకు శిక్షణనిచ్చే విధంగా, అనుభవం కలిగిన వక్త లను గుర్తించి శిక్షణనివ్వాలని సూచించారు.

పాలమూరు ఎత్తిపోతలను కల్వకుర్తి, జూరాలకు అనుసంధానం చేసే కార్యాచరణకు సంబంధించి డిజిటల్ స్క్రీన్ మీద వివరాలను అర్థం చేయించారు. కరివెన రిజర్వాయర్ నుంచి జూరాలకు నీటిని తరలించే ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాల్వల రూట్లను, ఉద్దండాపూర్ నుంచి కొడంగల్, నారాయణపేట్, తాండూర్, పరిగి, వికారాబాద్ చేవెళ్ల నియోజక వర్గాలకు సాగునీటిని తరలించే కాల్వల రూట్లను అధికారులకు వివరించారు. టన్నెల్ నిర్మాణాలను తగ్గించి ఓపెన్ కెనాళ్ళను తవ్వాలని, గ్రావిటీ ద్వారా నీటిని తరలించే విధంగా సాంకేతికతను మరింత లోతుగా పరిశీలించాలని ఆదేశించారు.

Next Story

Most Viewed