జిల్లా ప్రధాన ఆసుపత్రిలో… సిటీ స్కాన్ లేకపోవడమా?

by  |
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో… సిటీ స్కాన్ లేకపోవడమా?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్యారసిటమాల్ గోలి వేసుకుంటే చాలు, కరోనా రాదు అని మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌజ్‌కే పరిమితం అయ్యారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా నివారణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, రాష్ట్రం ఆవిర్భావంలో కీలక భూమిక పోషించింది కరీంనగర్ జిల్లానే అని అన్నారు. ఇలాంటి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో తొమ్మిది నెలల నుంచి సిటీ స్కాన్ మిషన్ లేకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

కరీంనగర్ జిల్లాలో కరోనా చికిత్సను గాలికి వదిలేశారని, వైరస్ సోకి చనిపోయిన ప్రతి ఒక్క ప్రాణానికి సీఎం కేసీఆరే కారణం అని ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన వాడే అయినా లాభం లేకుండా పోయిందని, కరోనా ట్రీట్మెంట్‌ను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సామాన్యుడు బతకడమే కష్టమైపోయిందన్నారు. ఎవరికి వారే కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో కరోనాతో పిట్టల్లా రాలుతున్నా పట్టించుకునే స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం లేదని, కరోనా నివారణకు తీసుకునే చర్యల్లో ప్రభుత్వం చెప్పేదొకటి కింది స్థాయిలో జరిగుతున్నదొకటని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు పరిశీలించి త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని భట్టి స్పష్టం చేశారు.



Next Story

Most Viewed