ఎమ్మెల్యే ఎదుటే అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం (వీడియో)

by  |
Mandal Review Meeting
X

దిశ, చిగురుమామిడి: హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ సమక్షంలో మంగళవారం ఎంపీపీ కొత్త వనీత అధ్యక్షతన చిగురుమామిడి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అయితే, సభలో ప్రజాప్రతినిధులు సమస్యలు తెలిపే క్రమంలో.. రామంచ సర్పంచ్ గుంటి మాధవి తమ గ్రామంలో ఇసుక అక్రమ తరలింపు యథేచ్చగా జరుగుతోందని తెలిపారు. ఇసుక కావాలని పర్మిషన్ల కోసం వస్తే అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ముదిమాణిక్యం బీజేపీ ఎంపీటీసీ యేలేటి రవీందర్ రెడ్డి మాట్లాడారు. మండల అధికారులు అధికార పార్టీ నేతలకే ఇసుక పర్మిషన్ ఇస్తున్నారని మండిపడ్డారు. విచ్చలవిడిగా మైనర్లు ట్రాక్టర్ నడుపుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

వారు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఎమ్మెల్యే సతీష్ ఎదుటే ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నాళ్ల నుంచి ఈ తతంగంపై పలు పత్రికల్లో వార్తలు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అనంతరం ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముదిమాణిక్యం గ్రామ సర్పంచ్ జక్కుల రవీందర్ కల్పించుకొని, ఇక్కడ పార్టీల విషయం మాట్లాడొద్దు అనడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై కాసేపు సభలో వాడిగావేడిగా చర్చ జరిగింది. దీంతో ఎమ్మెల్యే స్పందించి, ఈ సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed