గణేష్ నిమజ్జనం.. నేడు సీజేఐ ధర్మాసనం విచారణ

by  |
supreme court
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అవాంఛనీయమని జీహెచ్ఎంసీ కమిషనర్ వ్యాఖ్యానించారు. నిమజ్జనం కోసం పోలీసులు, స్థానిక సంస్థలు, విద్యుత్, ఫైర్ వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులతో చర్చించి ప్లాన్ చేసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు హఠాత్తుగా హైకోర్టు తీర్పు ప్రకారం ప్లాన్ మార్చుకోవడం సాధ్యం కాదని, నిమజ్జనం కోసం వచ్చే వాహనాలను దారి మళ్ళించడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ ప్రధాన న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారు. సీజేఐ ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

గణేశ్ నిమజ్జనం కొన్ని దశాబ్దాలుగా హుస్సేన్ సాగర్‌లోనే జరుగుతున్నదని, దీని కోసం నాలుగు నెలల ముందు నుంచే కసరత్తు మొదలవుతుందని, ఆ ప్రకారమే ఎక్కడ ఏ విభాగానికి చెందిన ప్రభుత్వ సిబ్బందిని ఎంత మందిని ఉంచాలో వర్క్ డివిజన్, డ్యూటీ అలాట్‌మెంట్ ప్రక్రియ కూడా ముగిసిపోయిందని, ఇప్పుడు ప్లాన్ మార్చుకోవాలంటే కష్టసాధ్యమని ఆ పిటిషన్‌లో వివరించారు. ఎక్కడికక్కడ కృత్రిమ కుంటలను ఏర్పాటు చేసి నిమజ్జనం చేయడం వీలుపడదని, చిన్న విగ్రహాలకు ఇబ్బంది లేకున్నా పెద్ద విగ్రహాలను ఆ ప్రకారం నిమజ్జనం చేయలేమని వివరించారు. ఇప్పటికే రూపొందించిన ప్లాన్‌కు భిన్నంగా మార్పులు చేస్తే వాహనాల రాకపోకలు, భారీ సంఖ్యలో ప్రజలను నియంత్రించడంలో సమస్యలు ఉన్నాయని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు.

ఈ నెల 20వ తేదీకల్లా నిమజ్జనం ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నదని, నాలుగైదు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని, హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పును అమలుచేసినట్లయితే నగర ప్రజల రాకపోకలు, రవాణా వ్యవస్థ కుప్పకూలిపోయి గ్రిడ్ లాక్ అవుతుందని ఆ పిటిషన్‌లో జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ మార్గాన్నే వద్దనుకుంటే నిమజ్జన ప్రక్రియ చాలా ఆలస్యమవుతుందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని కోర్టు చెప్తున్నప్పటికీ తగిన కరోనా జాగ్రత్తలతో నిర్వహిస్తామని వివరించారు. లేదంటే తొక్కిసలాటను కంట్రోల్ చేయడం ఇబ్బందవుతుందన్నారు.

ట్యాంక్ బండ్ వైపు నుంచి విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం జరుగుతుందని హైకోర్టు 38, 39 పాయింట్లలో పేర్కొనడం సహేతుకంగా లేదని పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులను అమలు చేయడం చాలా కష్టసాధ్యమన్నారు. ఇప్పటికే ప్రజలంతా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులతో తయారుచేసిన విగ్రహాలను కొనుగోలు చేసి ప్రతిష్ఠించారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఆ ఎస్ఎల్‌పీలో జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు స్వీకరించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గురువారం దీన్ని విచారణకు తీసుకోనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story