సీజే ఎన్వీ రమణ తెలుగులో విచారణ.. వరకట్నం కేసులో పరిష్కారం

by  |
nv-ramana
X

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో బుధవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. వరకట్నం కేసు విచారణలో లిటిగెంట్ మహిళ ఇంగ్లీషులో తన వాదనలు వినిపించడానికి తడబడుతుంటే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగులోనే వాదనలు వినిపించడానికి అనుమతినిచ్చారు. అంతేకాదు, ఆమె వాదనలను తెలుగు నుంచి ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రభుత్వోద్యోగిపై భార్య వరకట్నం కేసు పెట్టింది. 20ఏళ్లుగా ఈ కేసు కోర్టుల చుట్టూ తిరుగుతన్నది. తన భర్తకు జైలు శిక్ష పెరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విచారణ ప్రారంభమయ్యాక తన వాదనలు ఆంగ్లంలో వినిపించడానికి మహిళ తడబడ్డారు. ఇది గమనించిన సీజేఐ ఎన్వీ రమణ ఆమె మాతృభాష తెలుగులోనే మాట్లాడమని అనుమతినిచ్చారు. ఇలా కొంత సేపు విచారణ తెలుగులోనే జరిగింది. భర్తకు జైలు శిక్ష పెరిగితే, ఆయన ఉద్యోగం పోతే పరిహారం కూడా కోల్పోయి ఆమె కూడా నష్టపోతుందని సీజేఐ సదరు మహిళకు తెలియజేశారు.

ఆమె డిమాండ్‌తో ఉభయులకూ నష్టమేనని వివరించారు. దీనితో ఆమె సీజేఐ సూచనలను అంగీకరించి వరకట్నం వేధింపుల కేసును ఉపసంహరించుకోవడానికి అంగీకరించింది. తామిద్దరం కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నామని రెండు వారాల్లో అఫిడవిట్ సమర్పించాలని సీజేఐ సూచించారు. తెలుగు భాషపై మమకారాన్ని జస్టిస్ ఎన్వీ రమణ పలుసార్లు వెల్లడించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మాతృభాషపై తనకున్న మక్కువను బయటపెట్టుకున్నారు.

Next Story