ఆ పూల మొక్కలతో మూసీ కంపు పోయేనా..?

by  |
ఆ పూల మొక్కలతో మూసీ కంపు పోయేనా..?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో మూసీ నదిని అనుసరించి సుందరీకరణ కోసం ప్రభుత్వం చేపడుతున్న పనుల పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు 44 కిలో మీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తుండగా, పరిసర ప్రాంతాలు తీవ్ర దుర్గందాన్ని వెదజల్లుతున్నాయి. కొన్ని సందర్భాలలో ముక్కు మూసుకోకుండా ఆ ప్రదేశం నుంచి వెళ్లడం చాలా కష్టం. కాలుష్యంతో నిండిపోయిన మూసీని ప్రక్షాళన చేసి, ఆక్రమణలను తొలగించి పరిరక్షిస్తామని టీఆర్ఎస్​సర్కారు ఏర్పాటైన తొలినాళ్లలో
అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. ఇందుకోసం ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్’ను కూడా సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసి సుందరీకరణకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇటీవల చాదర్ ఘాట్, అఫ్జల్‌గంజ్, అంబర్ పేట్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో మూసీని అనుసరించి వాకర్స్ ట్రాక్స్ ఏర్పాటు చేశారు. దీనికి రెండు వైపులా పూల మొక్కలు, పచ్చనిగడ్డిని పెంచారు. ఇంతవరకు బాగానే ఉన్న భారీగా ఖర్చు చేసి ఇవన్నీ అందుబాటులోకి తెచ్చేకంటే ముందు మూసీలో మురుగు తగ్గించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మూసీ నదిలోకి యథేచ్చగా పారిశ్రామిక, మానవ వేస్టేజీని వదులుతున్నారు. హైదరాబాద్‌లో ప్రతిరోజు ఉత్పత్తయ్యే సుమారు 1,300 ఎంఎల్డీల మురుగునీటిలో 600ఎంఎల్డీలనే శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నట్టు అధికారికంగా చెప్తున్నారు. కానీ, భారీగా డ్రైనేజీ, ఇండస్ట్రియల్​వేస్టేజీ నదిలో కలుస్తోందని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ బిట్స్ పిలానీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ సుమన్ కపూర్ మూసీపై అధ్యయనం చేశారు. నదిలో కలుస్తున్న మురుగుతో నది బేసిన్‌లోని భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయని తేల్చారు.

తీవ్ర దుర్గందం..

గత మార్చి నెలలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మూసీనది పునరుజ్జీవనం, మూసీ పరిసరాల సుందరీకరణకు రూ.200 కోట్లు కేటాయించింది. వీటిని ఖర్చు చేసి ఇరు వైపులా వాకర్స్ ట్రాక్‌తో పాటు పచ్చని గడ్డిని, పూల మొక్కలను పెంచారు . కొన్ని చోట్ల పనులు జరుగుతుండగా నాగోల్, కొత్తపేట
ప్రాంతాలలో వాకర్స్ ట్రాక్, సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. త్వరలో వీటిని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అయితే, మూసీ నదిలో పారుతున్న మురుగు కారణంగా పరిసర ప్రాంతాలు తీవ్ర దుర్గందంలో మగ్గుతున్నాయి. ఇలాంటి కలుషిత వాతావరణంలో వాకర్స్ ట్రాక్ ఏర్పాటు చేసినా, సుందరంగా పూల మొక్కలు పెంచినా లాభం లేకుండా పోతోంది. ట్రాక్ మీదుగా నడుస్తుంటే తీవ్ర దుర్గందం వెదజల్లుతోంది. ఓ వైపు ఫెన్సింగ్ వేసినా దానిని నెట్టుకుని పందులు, కుక్కలు యధేచ్ఛగా ట్రాక్ పైకి వచ్చి తిరుగుతూ అపరిశుభ్రం చేస్తున్నాయి. ముందుగా మూసీలోకి మురుగు రాకుండా చర్యలు తీసుకుని అనంతరం పరిసర ప్రాంతాలు సుందరీకరణ చేస్తే బాగుండేదనే అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వం చేసే ఖర్చులు సగానికి పైగా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు తొలుత మూసీలో కలుషిత జలాలు.. నురుగు క్లీన్ చేస్తే దుర్గంధం రాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Next Story

Most Viewed