ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం.. కోటిమంది కార్మికులతో సమ్మె

by  |
CITU Protest
X

దిశ, మిర్యాలగూడ: కనీస వేతన జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 8న చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వీరారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటిమందికి పైగా ఉన్న కార్మికులకు లబ్ధి చేకూర్చే 72వ షెడ్యూల్‌లోని కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా, ప్రభుత్వం జీవించే హక్కును హరించి వేస్తోందని మండిపడ్డారు.

యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి సవరించిన ఐదు జీవోలను గెజిట్ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. కార్మికుల కనీస వేతనాల సాధనకోసం అక్టోబర్ 8న కోటిమంది కార్మికులతో సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల ముట్టడి, రాస్తారోకోలు చేపట్టాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డబ్బీకార్ మల్లేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, గౌతంరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్, ఎండీ అంజద్, అయూబ్, ఇంద్రారెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.

Next Story