చైనాలో రెండో దఫా.. కరోనా!

by  |
చైనాలో రెండో దఫా.. కరోనా!
X

బీజింగ్: చైనాలో కరోనా మళ్లీ ప్రాణం పోసుకుంటున్నది. దాదాపు మూడు నెలలు పోరాడి చైనా ప్రభుత్వం కరోనాకు కళ్లైం వేసింది. కానీ.. ఇప్పుడు ఆ దేశంలోకి విదేశాల నుంచి కరోనా దిగుమతి అవుతున్నది. దీంతో చైనాలో మళ్లీ కరోనా విజృంభించే ప్రమాదమున్నట్టు ఆందోళనలు వెలువడుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే అక్కడ 39 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్టు వైద్యాధికారులు తెలిపారు. నిన్న నమోదైన 39 పాజిటీవ్ కేసుల్లో 38 కేసులు విదేశాల నుంచి తిరిగి వచ్చినవాళ్లే అని అధికారులు వెల్లడించారు. దీంతో చైనా రాజధాని బీజింగ్‌లో దీర్ఘకాలం పాటు కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలందాయి.

చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ పుట్టిన సంగతి తెలిసిందే. కాగా, అక్కడి ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతో ఆ వైరస్ వ్యాప్తిని వూహాన్ నగరానికి మాత్రమే పరిమితం చేశారు. గత వారం రోజులుగా చైనాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వూహాన్‌లో కూడా పలు సంస్థలు, కర్మాగారాలు, మార్కెట్లు తెరుచుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాని, ఇప్పడు ఆ దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.

చైనాకు చెందిన జాతీయ ఆరోగ్య కమిషన్ సోమవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఆదివారం కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయిన 39 మందిలో ఒకరికి మాత్రం స్థానికంగానే వ్యాది సంక్రమించినట్లు తెలిపారు. దేశంలో పెద్దదైన పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన వాన్‌డాంగ్ ప్రావిన్సుకు చెందిన వ్యక్తి పాజిటీవ్‌‌గా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. గత రెండు నెలలుగా మూత పడిన పరిశ్రమలు కొన్ని గత వారమే ఉత్పత్తిని ప్రారంభించాయని.. అక్కడ నుంచే మరో కరోనా కేసు బయటపడటం భయాందోళనలు కలిగిస్తోందని అధికారులు అంటున్నారు.

చైనా ప్రస్తుతం విదేశీ ప్రయాణాలు పూర్తిగా నిలిపివేసింది. కాని విదేశాల్లో చిక్కుకున్న చైనీయుల కోసం చార్టెడ్ ఫ్లయిట్స్ నడుపుతోంది. ఇలా విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది కోవిడ్ – 19 బారిన పడ్డారు. అందుకే కరోనా కేసులు పెరిగాయని తెలుస్తోంది. మరోవైపు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకుండా పాజిటీవ్‌గా నిర్థారణ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఇలాంటి అసింప్టమాటిక్ కోవిడ్ – 19 కేసులు 78 నమోదయ్యాయి. మరో 1,047 అసింప్టమాటిక్ కేసులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా కరోనా బారిన పడే వారి వల్ల చాలా ప్రమాదం ఉంటుందని… వారి వల్ల ఇతరులకు వ్యాపించే అవకాశాలు అధికంగా ఉంటాయని అధికారులు అంటున్నారు.

ఆదివారం నాటికి చైనా మెయిన్‌ల్యాండ్ పరిధిలో 81,708 పాజిటీవ్ కేసులు నమోదవగా.. 77,078 మందికి చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. మరో 1,299 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, చైనాలో కోవిడ్ మరణాల సంఖ్య 3,331కి చేరుకుంది.

Tags: Coronavirus, china, second wave, import, cases, asymptomatic

Next Story

Most Viewed