‘మిర్చి’మాయ.. మార్కెట్లో సిండికేట్ దందా

by  |
‘మిర్చి’మాయ.. మార్కెట్లో సిండికేట్ దందా
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొందరు అధికారులతో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మిర్చివ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నిలువునా దోచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ మార్కెట్ పాలక వర్గం గత నెలే ముగియడంతో అడిగేవారు లేక వ్యాపారులు మిర్చి ధరలను అమాంతం తగ్గిస్తున్నారు. రైతులు చేసేదేం లేక చేతికొచ్చిన పంటను తెగ నమ్ముకుంటున్నారు. రానున్న రోజుల్లో మిర్చి పంట మార్కెట్‌కు పోటెత్తనుండడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే రెండు మూడు నెలలుగా చూసుకుంటే మిర్చి ధరలు భారీగా తగ్గాయని రైతులు చెపుతున్నారు.

నాలుగు నెలల క్రితం చూసుకుంటే తేజా రకం మిర్చి క్వింటాల్ గరిష్ట ధర రూ. 20వేలకు పైగా పలికింది. అదే ఇప్పుడు రూ. 15వేలకు దిగజారింది. అంటే దాదాపు రూ. 5000వేల వరకు ధర తగ్గింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టుబడి కూడా రావడం లేదంటూ వాపోతున్నారు. చేసేదేం లేక పంటను తక్కవ ధరకు విక్రయిస్తూ ఉసూరుమంటున్నారు. మూడు రోజుల క్రితం రూ. 14600 ఉన్న తేజా రకం మిర్చి ధర మంగళవారం నాటికి రూ. 13, 950గా పలికింది. ధరలు మరింత క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నిల్వ ఉంచిన మిర్చి ధరలు సైతం భారీగానే పడిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు నెలల క్రితం రూ. 19వేలు పలికిన ధరలు భారీగానే పతనమయ్యాయి.

వ్యాపారుల సిండికేట్..?

మిర్చి సీజన్ కావడంతో పంట భారీగా మార్కెట్ కు తరలివస్తుండడంతో వ్యాపారులందరూ కొంతమంది అధికారులు, దళారులతో కుమ్మక్కై మిర్చిధరలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పంట అధికంగా ఉండడంతో డిమాండ్ పడిపోయిందనే బూచీని చూపుతూ రైతును దగా చేస్తున్నారని, ఈ తతంగం అంతా తెలిసినా కొందరు అధికారులు మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వరంగల్, గుం టూరు మార్కెట్లలో మిర్చి ధర ఎక్కువగానే పలుకుతుందని.. కా నీ ఖమ్మం మార్కెట్లో మాత్రం అధికారుల సహకారం, దళారుల తో వ్యాపారులందరూ కుమ్మక్కై ధరలు అమాంతం తగ్గించేస్తున్నారని రైతులు చెబుతున్నారు. అయితే అలాంటిదేం లేదని వ్యాపారులు కొట్టిపారేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయంగా మిర్చి ఎగుమతులు లేవని.. ఫలితంగా ధరలు తగ్గుము ఖం పట్టాయని చెపుతున్నారు.

అధికారులు జోక్యం చేసుకోవాలి

ఆరుగాలం కష్టించి చేతికొచ్చిన పంటను మార్కెట్ తీసుకొస్తే వ్యాపారలు ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వ్యాపారులు సిండికేట్ కాకుండా చూడాలని, కనీస మద్దతు ధరలు ఇప్పించాలని వేడుకుంటున్నారు. వేలల్లో ధరలు తగ్గుతుడడంతో ఏం చేయాల్నో తెలియక వచ్చిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ధర పతనం కాకుండా చూడాలని, వ్యాపారులతో మాట్లాడి మద్దతు ధర ఇప్పించాలని కోరుతున్నారు.

Next Story