పనికి రాలేదని పిల్లాడిని కట్టేసి కొడతారా??

by  |
పనికి రాలేదని పిల్లాడిని కట్టేసి కొడతారా??
X

దిశ ప్రతినిధి: బడి పుస్తకాలు మోయాల్సిన పసిపిల్లలు కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఆటపాటలతో గడవాల్సిన వారి జీవితం మెకానిక్ షాపుల్లో, ప్రమాదకర పరిశ్రమలలో, వెల్డింగ్ పనుల్లో మగ్గుతోంది.

ఇది వారికి శాపమా? తల్లిదండ్రుల పాపమా? లేక ప్రభుత్వ వైఫల్యమా?? ఇన్ని చట్టాలున్నా వారిని పనిలో పెట్టుకుని వెట్టిచాకిరి చేయించుకుంటున్న యజమానులను ఎందుకు ఏ చట్టాలకీ భయపడట్లేదు?

పన్నెండేళ్ల బాలుడిని పనిలోకి రాలేదని యజమాని కాళ్లతో తంతుంటే ఆ చిన్నారిని కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు ఎందుకు అడ్డుపడలేదు?? వదిలేయమంటూ ప్రాధేయపడుతున్నా ఆ బాలుని రోదన అక్కడ చూస్తూ నిలుచున్న ఏ తల్లి హృదయాన్ని తాకలేదు? పైగా ఇంకా కొట్టమని యజమానిని రెచ్చగొట్టడం అమానవీయం అనాలో అమాతృత్వం అని పేరు పెట్టాలో తెలియడం లేదు.

గుండెల్ని పిండేసే ఈ ఘటన నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ (ఎ)లో జరిగింది. బాలకార్మికుల హక్కులను కాలరాస్తూ ఓ వ్యక్తి… బాలుడిని కట్టేసి చితకబాదిన ఘటన బుదవారం చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ బాలయ్య అనే వ్యక్తి.పనికి రావట్లేదని అమాయక 12 సంవత్సరాల బాలుడిని అందరూ చూస్తుండగానే.. కాళ్లు, చేతులకు తాడు కట్టి ఈడ్చుకెళ్లాడు.

తనను కొట్టొద్దని ప్రాధేయపడుతున్నా అతని మనసు కరగలేదు. విచక్షణారహితంగా కాళ్లతో తన్నాడు. అయినా అతని కోపం తీరలేదు. అక్కడే ఉన్న చెట్టుకు కట్టేసి తాడుతో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అయినా ఎవరూ అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు.

ఈ దృశ్యాలను కొందరు వ్యక్తులు విడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గామారింది. వీడియోలో కొందరు స్త్రీలు అలాగే కొట్టాలి అని మాట్లాడటం కొందరికి ఆగ్రహం తెప్పిస్తోంది. సదరు యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు.

కాగా దండుగుల బాలయ్య సబ్ కాంట్రాక్టర్ అని తెలుస్తోంది. కాళేశ్వరం ప్యాకేజి 21 కి సంబంధించిన సొరంగం, కాలువల పనులకు రాయి, మోరం తరలిస్తుంటాడు. సబ్ కాంట్రాక్టర్ గా చిన్న చిన్న పనులు చేస్తుంటాడని సమాచారం. అతడికి ఉన్న ట్రాక్టర్ల ద్వారా వాటి తరలింపు పనులు చేస్తుంటాడు. బాలుడి తండ్రి సైతం బాలయ్య వద్ధ పనిచేసేవాడు. అప్పుల క్రింద వారి ఇంటిని సైతం లాక్కుని బాకీ రికవరి కై పిల్లలతో పనిచేయిస్తున్నాడు అని స్థానికులు చెబుతున్నారు.

బాధిత బాలుడు మంగళవారం పనికి పోకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో తన తమ్ముడి కూతురితో అసభ్యంగా మాట్లాడాడన్న కారణంతో కొట్టానంటూ ప్లేటు ఫిరాయించాడని బాధితులు వాపోతున్నారు. బాలయ్యపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed