శ్రీకాంత్‌ది నిరుద్యోగ ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య : చెరుకు శ్రీనివాస్ రెడ్డి

by  |
శ్రీకాంత్‌ది నిరుద్యోగ ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య : చెరుకు శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, దుబ్బాక : అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగ ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలని విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయక, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యువకుడు శ్రీకాంత్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే శ్రీకాంత్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. తమకు ఏదైనా కష్టం వస్తే తనతో చెప్పుకోవాలని పెద్ద గుండవెల్లి యువతను కోరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని, నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం మెడలు వంచి కొట్లాడేందుకు ముందుండేది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు.

ఎంతో మంది ఆత్మహత్యలతో తెచ్చుకున్న తెలంగాణ రాబంధుల చేతిలో నలిగిపోతోందన్నారు. యువత నడుం బిగించి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతానన్నారు. క్షనికావేశంలో యువత ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. చేతికందిన కొడుకు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం అన్నారు. తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కోసమైనా ఒక్కసారి ఆలోచన చేయాలని యువతకు సూచించారు. బాధిత కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. జనవరి ఒకటిన తమ తండ్రి స్వర్గీయ ముత్యంరెడ్డి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని స్పష్టం చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు అనంతుల శ్రీనివాస్, వెంకటస్వామి గౌడ్, శ్రీధర్, భరత్, అఫీజ్, తదితరులు ఉన్నారు.

Next Story