పిల్లల్ని కనేందుకు ముహూర్తం కావాలట..!

by  |
పిల్లల్ని కనేందుకు ముహూర్తం కావాలట..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కొంత మంది ప్రజలు ఇంకా మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. మంచి రోజు, తిథి, నక్షత్రాల చూసుకుంటూ డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు డెలివరీ చేయించుకునేందుకు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ బుకింగ్, సిజేరియన్లకు అడ్వాన్సులు ఇస్తున్నారు. దీంతో కాసుల కక్కుర్తి కోసం డెలివరీ చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యులు సిద్ధంగా ఉన్నారు. అందుకే జనవరి ఒకటో తేదీన ప్రతి ప్రసూతి ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో డెలివరీలు కావడం సహజమైంది. ప్రముఖుల పుట్టిన రోజు నాడే తాము బిడ్డలను కనాలని తపన పడే దంపతులు లేకపోలేరు. వారి జాతకాన్ని పుణికిపుచ్చుకొని వృద్ధిలోకి వస్తారన్న ఆశ. సిజేరియన్ ఆపరేషన్లను ఇలాంటి మూఢ విశ్వాసాలు సైతం ఓ కారణంగా చెప్పొచ్చు. ముహూర్తం చూయించుకున్నారా? ఏ టైంలో సర్జరీ చేయాలి? అంటూ కొందరు గైనకాలజిస్టులు ప్రైవేటు ఆస్పత్రుల్లోకి కాన్పుకోసం వచ్చిన వారిని అడుతుండటం గమనార్హం. నార్మల్​డెలివరీ వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చునని కాన్పు చేయించుకునే వారు గుర్తించడం లేదని వైద్యులు లేదంటున్నారు. దేశంలో సిజేరియన్లలో తెలంగాణ ముందు వరుసలో నిలవడానికి ఇలాంటి కారణాలే ఎక్కువ.

మూడింతలు సిజేరియన్లే..

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న డెలివరీల్లో దాదాపు మూడింట రెండొంతులు సిజేరియన్ ఆపరేషన్లే. ప్రతి పది మంది గర్భిణుల్లో సుమారు ఆరుగురికి ఆపరేషన్ల ద్వారానే కాన్పు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి గంటకూ సగటున 30 సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఐదేండ్లు క్రితం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన డెలివరీల్లో 40 శాతం మాత్రమే ఆపరేషన్లు కాగా, 2019-20 కాలంలో అది 44.5 శాతానికి పెరిగింది. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐదేండ్ల క్రితం 74.5 శాతం ఉండగా ఆ సంఖ్య ప్రస్తుతం 81.5 శాతానికి పెరిగింది. సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా అనేక కారణాలతో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ప్రజల్లో ముహూర్తాలు, కోరుకున్న సమయానికి ప్రసవం కావడం లాంటివాటితో సిజేరియన్లు జరుగుతున్నట్టు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దేశంలో అతి ఎక్కువ సిజేరియన్ ఆపరేషన్లు జరిగే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న డెలివరీల్లో సుమారు 82% సిజేరియన్ ఆపరేషన్లే అని నేషనల్​ఫ్యామిలీ హెల్త్​సర్వే 2019–20 స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఈ సంఖ్య దాదాపు సగం వరకు ఉంటున్నాయని జాతీయ స్థాయి నివేదిక స్పష్టం చేసింది. గర్భిణులకు వీలైనంత వరకు సాధారణ డెలివరీలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు.

సిజేరియన్ల సంఖ్య తగ్గిస్తాం : అధికారులు

సిజేరియన్ల సంఖ్య తగ్గిస్తామని సంబంధిత శాఖ అధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. మిడ్ వైఫరీ నర్సులు ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలే ఎక్కువగా జరుగుతున్నాయని, ఆ సిబ్బంది లేనిచోట మాత్రమే సర్జరీలు జరుగుతున్నాయని వివరించారు. కాన్పుల్లో ఆపరేషన్ల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమవుతున్నామని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 60 మంది శిక్షణ పొందిన మిడ్‌వైఫరీ నర్సులు ఎనిమిది ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారన్నారు. అక్కడ సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య బాగా తగ్గిందని గుర్తుచేశారు. 2017లో 60 మంది స్టాఫ్ నర్సులకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మిడ్‌వైఫరీ శిక్షణ ఇచ్చిందన్నారు.

లండన్, దక్షిణాఫ్రికా నుంచి నిపుణులను తీసుకొచ్చి దాదాపు ఏడాదిన్నర పాటు శిక్షణ ఇప్పించామని, ప్రత్యేకంగా రూ.15 వేల ప్రోత్సాహక నగదు సైతం ఇచ్చామని గుర్తుచేశారు. మాతా శిశు ఆస్పత్రుల్లో సర్జరీలు బాగా తగ్గి సహజ ప్రసవాలు పెరిగాయన్నారు. ఈ స్ఫూర్తితోనే ఆ తర్వాత కొంత కాలానికి మరో 30 మంది శిక్షణ ఇప్పించామని, ప్రస్తుతం మరో 55 మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలిపారు. జనవరిలో మరో 120 మందికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి మరో 120 మందికి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. కనీసం 1500 మంది శిక్షణ పొందిన మిడ్ వైఫరీలను ప్రతి డెలివరీ పాయింట్స్‌లో నియమిస్తే మంచి ఫలితాలుంటాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పనిచేస్తున్న నర్సుల్లోనే కొందరిని ఎంపిక చేసి మిడ్‌వైఫరీ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. దశలవారీగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిజేసే స్టాఫ్‌నర్సులను ఈ శిక్షణకు ఎంపిక చేసే అవకాశాలూ ఉన్నాయని, రాబోయే రెండేండ్లలో 1500 మంది మిడ్ వైఫరీలను తయారు చేయాలని వైద్యారోగ్య శాఖ సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందని సమాచారం.

అది పరమదోషం..

ఈ మధ్య కాలంలో పిల్లలను కనడానికి ముహూర్తం చూసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. మంచి ముహూర్తం ఉంటే చెప్పండి అంటూ మా దగ్గరికి అలా చాలా మంది వస్తుంటారు. మేము తప్పనిసరి పరిస్థితుల్లో తిథి, నక్షత్రాలు చెబుతుంటాం. ఎవరు అలా పాపం అది చేసినా ముహూర్తం పెట్టినోళ్లకూ తప్పదు. ఆ దోషం మేం మోయాల్సిందే. అలా డెలివరీ చేయడం పరమ దోషం. ఆ పాద సమయంలో పుడితే ధనవంతులు అవుతారని, విద్యావంతులు అవుతారని నమ్మి సిజేరియన్ ద్వారా పిల్లలు కనడం తప్పు. సహజ సిద్ధంగా డెలివరీ జరిగితేనే జాతక ప్రభావం ఉంటుంది. ఇలా సమయం చూసుకుని కాన్పు చేసుకుంటే శాస్త్ర ప్రకారం చెల్లదు.

– మధుశర్మ, జ్యోతిష్కులు, పురోహితులు, రామాంతాపూర్, హైదరాబాద్



Next Story

Most Viewed