కేంద్రంతో రాష్ట్రాల అమీతుమీ

by  |
కేంద్రంతో రాష్ట్రాల అమీతుమీ
X

దిశ, న్యూస్ బ్యూరో: అసలే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలకు ‘కరోనా’ ఊహించని విపత్తును తీసుకొచ్చింది. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో రాష్ట్రాలు ఆర్థికంగా మరింత ఊబిలోకి కూరుకుపోయాయి. కేంద్రం నుంచి వస్తుందనుకున్న సాయం అందకపోవడం నిరాశపర్చింది. ఇప్పటిదాకా
కరోనా కట్టడిపై దృష్టి పెట్టిన రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కేంద్రంపై అసమ్మతి స్వరాన్ని వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ ముగింపునకు వస్తుందన్న సంకేతాలు వినిపిస్తుండటంతో ఇకపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య మాటల యుద్ధం తప్పేలా లేదు. ఇప్పటికే కేరళ, పంజాబ్, రాజస్థాన్ లాంటి బీజేపీయేతర రాష్ట్రాలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. రాష్ట్రాల స్వీయ ఆర్థిక వనరులన్నింటిపైనా కరోనా దెబ్బకొట్టడంతో కేంద్రం ఆదుకుంటుందని ఆ రాష్ట్రాలు పెట్టుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి. ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలే కిందామీదా పడి నిధులను సమకూర్చుకున్నాయి. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదని పంజాబ్ ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం.

డిమాండ్లన్నీ పెండింగ్‌లోనే..

రాష్ట్రాల స్వీయ ఆర్థిక వనరులకు కీలకంగా ఉన్న మద్యం దుకాణాలు తెరుచుకోడానికి అవకాశం లేకపోవడం, కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ లేదా హెలికాప్టర్ మనీ అందకపోవడం, ఎఫ్ఆర్‌బీఎం పరిధిని పెంచకపోవడం, ఓవర్ డ్రాఫ్ట్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం, అప్పులను తిరిగి చెల్లించనవసరం లేకుండా ఐదారు నెలలు వాయిదా వేసే అవకాశాన్ని కల్పించడం, ఎంపీ లాడ్స్ నిధులను నిలిపేయడం, ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చే విరాళాలకు ఒక నిబంధన ప్రధాని సహాయ నిధికి మరో నిబంధన… ఇలాంటి డిమాండ్లన్నీ కేంద్రం దగ్గర పెండింగ్‌లోనే ఉండటం రాష్ట్రాలకు అసంతృప్తి కలిగించింది. దీనికి తోడు ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశమైనా కరోనా అవసరాల కోసం పీపీఈ కిట్లు, మాస్కులు తదితరాలను సమకూర్చుకునే వెసులుబాటు ఇవ్వకుండా కేంద్రమే వాటిని అన్ని రాష్ట్రాలకూ పంపుతుందని అధికారాన్ని కేంద్రీకృతం చేసుకోవడంపై రాష్ట్రాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఒకవైపు సహకార సమాఖ్య స్ఫూర్తి అని వల్లెవేస్తూనే మరోవైపు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నరన్న విమర్శలు ముఖ్యమంత్రుల నుంచి వినిపిస్తున్నాయి.

కనిపించని టీమ్ ఇండియా స్ఫూర్తి..

నరేంద్ర మోడీ పీఎంగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వల్లెవేసిన ‘టీమ్ ఇండియా’, ‘కోఆపరేటివ్ ఫెడరలిజం’ లాంటి మాటలు రాష్ట్రాలకు కొత్త ఆశలు రేకెత్తించాయి. కానీ, అవి మాటలకే పరిమితమయ్యాయని చాలా మంది సీఎంలు ఇప్పటికే అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు కరోనాతో మొత్తం అతలాకుతలమైన పరిస్థితుల్లో రాష్ట్రాల అవసరాలను, డిమాండ్లను ప్రధాని పట్టించుకోలేదనీ, సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కేరళ ఆర్థిక మంత్రి బహిరంగంగానే విమర్శించారు. లాక్‌డౌన్ నిర్ణయం తీసుకునేముందు రాష్ట్రాలను సంప్రదించలేదనీ, కనీస
స్థాయిలోనైనా సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించలేదని, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పలువురు ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించారు. ఈ కారణంగా ఒక్కో రాష్ట్రంలో లక్షలాది మంది వలస కార్మికులు చిక్కుకుపోతే వారి సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడింది. ఇందుకు ఆర్థిక వనరులను కేటాయించక తప్పలేదు. అసలే కరువులో ఉన్న సమయంలో అదనంగా ఈ భారాన్ని మోయాల్సి వచ్చింది.

ఆగిన రెవెన్యూ..

అనేక రాష్ట్రాలకు స్వీయ ఆర్థిక ఆదాయంలో సింహభాగం మద్యం (ఎక్సైజ్) ద్వారానే సమకూరుతోంది. అయితే, లాక్‌డౌన్ కారణంగా మద్యం దుకాణాలు బంద్ చేయాల్సి వచ్చింది. వాహనాల పన్ను, స్టాంపు-రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే పన్ను, పెట్రోలు మీద వచ్చే ఆదాయం.. ఇలా మొత్తం రెవెన్యూ ఆగిపోయింది. కానీ, రాష్ట్రాల అవసరాలు మాత్రం పెరిగిపోయాయి. కరోనా కోసం అదనంగా మందులు, కిట్లు సమకూర్చుకోవడం, ఆస్పత్రులకు అదనపు సౌకర్యాలు సమకూర్చుకోవడం, వలస కార్మికులకు, రైతులకు, రేషనుకార్డులున్నవారికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయడం.. ఇలాంటివన్నీ రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సరిగ్గా ఈ సమయంలోనే సీఎం కేసీఆర్ హెలికాప్టర్ మనీ, ఎఫ్ఆర్‌బీఎం పరిధి పెంచడం తదితరాలను ప్రస్తావించారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సైతం ”కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదు. మద్యం అమ్మకాలను ఆపేయించింది. అన్ని దారులూ మూసుకుపోయిన తర్వాత కేంద్రం ఆదుకుందా?” అంటూ పలు ప్రశ్నలను లేవనెత్తారు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ సైతం ‘పీఎం కేర్స్’కు ఒక్క వారంలోనే సుమారు రూ.650 కోట్లు సమకూరాయనీ, వీటిని ఏయే అవసరాలకు ఎలా ఖర్చు పెడతారన్న అంశంపై స్పష్టత లేదనీ, ఈ నిధులను రాష్ట్రాలకు వినియోగించవచ్చుగదా అని ప్రశ్నించారు.

కేంద్రం ఏకపక్ష నిర్ణయం.!

పార్లమెంటు సభ్యులకు ఏటా ఒక్కొక్కరికి ఇచ్చే ఐదు కోట్ల రూపాయల ఎంపీలాడ్స్ ఫండ్స్‌నూ రెండేళ్ల దాకా నిలుపుదల చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు సభ్యులుగా వారికి చట్టబద్ధంగా వచ్చే డబ్బును కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఎలా ఆపేస్తుందన్న విమర్శలు అప్పుడే వినిపించాయి. రాష్ట్రాలకు ఆర్థిక వనరులు పూర్తిగా స్తంభించిపోయిన తరుణంలో ఎంపీలాడ్స్ నిధుల ద్వారా సమకూరే డబ్బును ఆ నియోజకవర్గంలో కరోనా అవసరాలకు వినియోగించుకోవచ్చన్న ఆశతో ఉన్న ఎంపీలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు మొత్తం రూ.80 కోట్లను సీఎంరిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ, కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా రాష్ట్రానికి ఊహించని దెబ్బ తగిలింది. ఇదే విషయమై తిరువనంతపురం ఎంపీ శశి‌థరూర్ తీవ్రంగా స్పందించి ఇది రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయమనీ, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక సభ్యుడికి చట్టం ద్వారా లభించిన అవకాశాన్ని కేంద్రం ఒక్క నిర్ణయంతో ఎలా నీరుగారుస్తుందని ప్రశ్నించారు. దీనికి తోడు పార్లమెంటు సభ్యుల వేతనంలో మూడో వంతును కూడా కత్తిరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

కేంద్రంపై రాష్ట్రాల పోరు..

ఈ అంశాలన్నింటినీ లాక్‌డౌన్ అనంతరం తెరమీదకు తేవడానికి బీజేపీయేతర రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. టీమ్ ఇండియా, సహకార సమాఖ్య స్ఫూర్తిలాంటివన్నీ ఎందుకు మసకబారాయనీ, కేంద్రం రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని, రాష్ట్రాల హక్కులకు విలువ ఇవ్వడంలేదని.. ఇలా అనేక
అంశాలను చర్చకు తేవాలనుకుంటున్నాయి. దక్షిణాదిన కర్నాటక మినహా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీయేతర పార్టీలే ఉన్నాయి. తమిళనాడు, ఆంద్రప్రదేశ్‌లలో బీజేపీతో సఖ్యతగా ఉన్నప్పటికీ డిమాండ్ల విషయంలో గట్టిగానే స్వరం వినిపించే అవకాశాలున్నాయి. ఇక రాజస్థాన్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తెలంగాణ, కేరళ, పంజాబ్ తదితర బీజేపీయేతర రాష్ట్రాలన్నీ కేంద్రంతో అమీతుమీ అనే పోరాటానికే సిద్ధమవుతున్నాయి. జీఎస్టీ పేరుతో ఇప్పటికే ఆదాయాన్ని కోల్పోయామనీ, 15వ ఆర్థిక సంఘం సిఫారసులతో మరింత నష్టపోయాయని, ఇప్పుడు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగించే చర్యలతో ఫెడరల్ స్వభావమే ప్రశ్నార్థకమైందన్నది ఈ రాష్ట్రాల అభిప్రాయం. లాక్‌డౌన్ తర్వాత రాజకీయంగా మాటల తూటాలు పేలడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

Tags: Team India, Cooperative Federalism, Corona, LockDown, MPLADS Funds, Liquor, FRBM Limit, Financial Stimulus Package, Status

Next Story

Most Viewed