గచ్చిబౌలి ఆస్పత్రిలో కేంద్ర బృందం తనిఖీలు

by  |
గచ్చిబౌలి ఆస్పత్రిలో కేంద్ర బృందం తనిఖీలు
X

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. ప్రధానంగా గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన 1500 పడకల ప్రత్యేక ఆసుపత్రి, నార్సింగిలోని అతిపెద్ద కిచెన్ అక్షయపాత్రను సందర్శించింది. భారత ప్రభుత్వ జల శక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోకా, పబ్లిక్ హెల్త్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ గెడం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, కన్జ్యూమర్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్.ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది కేంద్ర ప్రతినిధి బృందంలో ఉన్నారు. తొలుత గచ్చిబౌలిలో ప్రతేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రిని కేంద్ర బృందం పరిశీలించింది. ఈ ఆస్పత్రిలో కల్పించిన సౌకర్యాలపై పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ జయరాంరెడ్డి కేంద్ర బృందానికి వివరించారు. ఇప్పటికే గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రులను పూర్తి స్థాయి కరోనా ఐసోలేషన్ ఆస్పత్రులుగా మార్చామన్నారు. ఆయా హాస్పిటళ్ల స్థాయి మించి కేసులు నమోదైతే గచ్చిబౌలి ప్రత్యేక ఆస్పత్రికి రోగులను తరలిస్తామన్నారు. అన్ని జిల్లాల్లోని ప్రధాన ఆస్పత్రులను కరోనా దవాఖానలుగా మార్చామన్నారు. కరోనా నివారణ, చికిత్సలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చేస్తున్నట్టు కేంద్ర బృందానికి రఘునందన్ రావు వివరించారు. అనంతరం కేంద్ర ప్రతినిధి బృందం గచ్చిబౌలి ఆస్పత్రిలోని ఐసీయూ, అత్యవసర, ఐసోలేషన్ వార్డులు, థియేటర్లు, స్టోర్ రూములను పరిశీలించింది. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ డీసీపీ వెంకటేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: Central government, representatives, checks, Gachibowli, Corona Hospital

Next Story