గ్యాస్ మంట తగ్గేనా..?

by  |
గ్యాస్ మంట తగ్గేనా..?
X

దిశ ప్రతినిధి, మెదక్ : పెట్రోల్, డీజిల్ ధరల మాదిరిగా గ్యాస్ ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్రం పక్షం రోజుల్లో రెండు సార్లు గ్యాస్ ధరలను పెంచేసింది. ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు మళ్లీ రూ.25 పెరిగింది. దీంతో ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.1000కి చేరువైంది. దీనికితోడు గ్యాస్ ఏజెన్సీలు రవాణా చార్జీలను సైతం పెంచేశాయి. ఇదిలా ఉండగా గత ఆరు నెలలుగా కేంద్రం సబ్సిడీని బంద్ జేసింది. దీంతో గ్యాస్ కొనలేకపోతున్నామని సామాన్య, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు కేంద్రం తీరుపై మండి పడుతున్నారు.

వెయ్యికి చేరువలో సిలిండర్ ..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్యాస్ వినియోగం పెరిగింది. సామాన్యులు గ్యాస్ పొయ్యి మీద వంట చేసేందుకు అలవాటు పడేలా మొదట కేంద్రం సబ్సిడీపై అందించింది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం చేసిన ప్రయత్నం నచ్చడంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరు గ్యాస్ వినియోగానికి అలవాటు పడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 10 లక్షల కుటుంబాలు గ్యాస్‌ను వినియోగిస్తున్నాయి. మొన్న రూ .25 పెంచిన కేంద్రం, మరోసారి రూ .25 పెంచింది. దీంతో మొన్నటి వరకు రూ. 925 కు వచ్చిన గ్యాస్ ఇప్పుడు రూ .960 చేరింది. దాదాపు ఈ సంవత్సరంలో గ్యాస్ ధర పది సార్లు పెరిగింది. వెయ్యికి చేరువ కావడంపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా గత ఆరు నెలల నుంచి కేంద్రం సబ్సిడీని కూడా కట్ చేసింది.

రవాణా చార్జీలు అదనం …

జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు రవాణా చార్జీల పేరిట వినియోగదారులను నిట్టనిలువున దోపిడి చేస్తున్నారు. నిజానికి గ్యాస్ సిలిండర్లను గృహ వినియోగదారులకు ఉచితంగా డెలివరీ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ .30 వసూలు చేస్తున్నాయి. మరికొన్ని గ్యాస్ ఏజెన్సీలు రూ. 50 కూడా వసూలు చేసుకోవాలని లేదంటే గ్యాస్ ఆఫీస్‌కు వచ్చి తీసుకెళ్లాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. చేసేదేమి లేక అధిక డబ్బులు వెచ్చించి గ్యాస్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కో గ్యాస్ ధర రూ.1000 చెల్లించాల్సి వస్తోంది. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు ..

కేంద్రం మాటిమాటికి గ్యాస్ ధరలు పెంచడంపై గ్యాస్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో గ్యాస్ మంట వెలిగించకుండానే మండుతుందంటూ కేంద్రంపై సెటైర్లు వేస్తున్నారు. ప్రతీది గ్యాస్ లేకుండా వంట చేయలేమని, అలాంటిది గ్యాస్ ఇష్టారీతిన పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాగే కొనసాగితే గ్యాస్ వినియోగం తగ్గించి మళ్లీ కట్టెల పొయ్యి వాడాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకొని పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed