తెలంగాణకు రూ.224 కోట్ల సాయం

by  |
తెలంగాణకు రూ.224 కోట్ల సాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ.224.50కోట్లను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. పునరావాస కార్యక్రమాలకు సహాయపడే విధంగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్ఎఫ్)కి నిధులను జమ చేయనుంది. నిబంధనల ప్రకారం కేంద్ర సాయం వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ప్రజలకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ప్రత్యేక చొరవను తీసుకున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం ఇప్పటికే హైదరాబాద్‌ను సందర్శించి వరద పరిస్థితిని తెలుసుకుని నష్టాన్ని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ బృందం నివేదిక కేంద్రానికి అందించాల్సి ఉంది. నివేదిక వచ్చిన తర్వాత సమగ్ర వరద ఉపశమన ప్యాకేజీ కోసం కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించననుంది. ఇటీవల వరదలు, భారీ వర్షాల కారణంగా పాడైన రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.202కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ముందస్తుగా నిధులు విడుదల చేసి రాష్ట్రానికి అండగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story