వెలిగొండపై డీపీఆర్‌ అందలేదు.. పార్లమెంట్‌లో కేంద్రం క్లారిటీ

by  |
వెలిగొండపై డీపీఆర్‌ అందలేదు.. పార్లమెంట్‌లో కేంద్రం క్లారిటీ
X

దిశ, ఏపీ బ్యూరో: వెలిగొండ ప్రాజెక్ట్‌కు సంబంధించి కృష్టా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఇంకా డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) అందలేదని జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ టెక్నో-ఎకనమిక్‌ మదింపు కోసం వెలిగొండ ప్రాజెక్ట్‌ ప్రతిపాదన కూడా కేంద్ర జల సంఘానికి అందనందున జల శక్తి మంత్రిత్వ శాఖ సలహా సంఘం వెలిగొండ ప్రాజెక్ట్‌ను ఆమోదించలేదని వివరణ ఇచ్చారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూలు కింద నిర్దేశించిన ప్రాజెక్ట్‌లను (వెలిగొండతో సహా) పూర్తి చేయడానికి అనుమతించినందున వెలిగొండను ఆమోదం పొందిన ప్రాజెక్ట్‌గా పరిగణించి దానిని పూర్తి చేసి ఆపరేట్‌ చేయడానికి అనుమతించాలని గత అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖను కోరినట్లు షెకావత్‌ వెల్లడించారు. అలాగే కేఆర్‌ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్‌ వెలువడిన ఆరు మాసాలలోగా వెలిగొండకు క్లియరెన్స్‌లు పొందాలన్న నిబంధనలు కూడా విధించవద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరిన విషయాన్ని సభలో స్పష్టం చేశారు.

కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు గత ఆగస్టు 15న విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం వెలిగొండ ప్రాజెక్ట్‌ ఆమోదం పొందని ప్రాజెక్ట్‌ల జాబితాలోనే ఉన్నట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. కేఆర్‌ఎంబీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఆమోదం పొందని ఏ ప్రాజెక్ట్‌ అయినా షెడ్యూలు 1, 2 లేదా 3లో చేర్చినంత మాత్రాన ఆ ప్రాజెక్ట్‌లు అనుమతి పొందినవిగా పరిగణించడానికి వీలు లేదని వ్యాఖ్యానించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం మేరకు షెడ్యూళ్ళలో పూర్తి చేసిన లేదా నిర్మాణంలో ఉండి ఆమోదం పొందని ప్రాజెక్ట్‌లపై మదింపు జరిగి ఆమోదం పొందాల్సి ఉంటుందని మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed