విశాఖలో నౌకా పర్యాటకంపై కేంద్రం కీలక ప్రకటన

by srinivas |
MP Vijayasai Reddy
X

దిశ, ఏపీ బ్యూరో : విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లోని ఔటర్‌ హార్బర్‌లో క్రూయిజ్‌ టెర్మినల్‌ బెర్త్‌, టెర్మినల్‌ భవనం నిర్మించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ బెర్త్‌పై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధాన మిచ్చారు. సాగరమాల పథకంలో భాగంగా విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లోని ఔటర్‌ హార్బర్‌లో క్రూయిజ్‌ టెర్మినల్‌ బెర్త్‌, టెర్మినల్‌ భవనం నిర్మాణం కోసం పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ రూ. 96 కోట్లు, క్రూయిజ్‌ కమ్‌ కోస్టల్‌ కార్గో టెర్మినల్‌ నిర్మాణం కోసం పర్యాటక శాఖ రూ.38 కోట్లు కేటాయించినట్లు సమాధానమిచ్చారు.

పర్యాటక రంగాన్ని ప్రభావితం చేసే అంశాల్లో క్రూయిజ్‌ టూరిజం (నౌకా పర్యాటం) ఒకటని చెప్పుకొచ్చిన ఆయన సముద్రం, నదుల్లో నౌకా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. స్వదేశ్‌ దర్శన్‌లో కోస్టల్‌ టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధిని చేర్చి వాటికి అవసరమైన వసతుల అభివృద్ధి కోసం ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ జాతీయ కార్యక్రమంగా చేపట్టిన సాగరమాల పథం ద్వారా దేశంలోని 7,500 కి.మీ పొడవైన తీర ప్రాంతాల అభివృద్ధి ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ముమ్మరం చేయడంతోపాటు పర్యాటక రంగానికి కూడా ఈ ప్రాజెక్ట్‌ కింద కొత్త ఊపు వస్తుందని స్పష్టం చేశారు.

అలాగే స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ వద్ద హోప్‌ ఐలాండ్‌, కోరింగ వన్యమృగ సంరక్షణ కేంద్రం, పాసర్లపూడి, ఆదూరు, ఎస్‌.యానాం, కోటిపల్లి ప్రాంతాలలో పర్యాటక రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.67 కోట్లు, నెల్లూరు జిల్లాలోని పులికాట్‌ సరస్సు, ఉబ్బలమడుగు జలపాతం, నేలపట్టు, కొత్తకోడూరు, మైపాడు, రామతీర్ధం, ఇస్కపల్లి వద్ద పర్యాటక వసతుల కల్పన కోసం రూ.49 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమాధానంలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed