వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు… కీలక ఆధారాలు లభ్యం

by  |
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు… కీలక ఆధారాలు లభ్యం
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఆరో రోజు విచారణలో కీలక వివరాలు సేకరించారని తెలుస్తోంది. హత్య కేసులో AP-04-1189 నెంబర్‌ గల ఇన్నోవా వాహనం కీలకంగా మారింది. రవాణా శాఖ అధికారుల సహకారంతో వాహనం ఓనర్ అయిన అరకటవేముల రవి, డ్రైవర్‌ గోవర్ధన్‌లను విచారించి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. హత్యకు ముందు ఇన్నోవా కారులో వచ్చిన వారిపై సీబీఐ ఆరా తీస్తోంది. మరోవైపు హత్య జరిగిన తర్వాత ఫోటోలు ఎవరు తీసారనే అంశంపై కూడా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే విచారణ మొదలుపెట్టినప్పటి నుంచి సీబీఐ అధికారులు ఆయన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులను పదేపదే ప్రశ్నిస్తున్నారు.

మొదటిరోజు వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని ఏడు గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రెండోరోజు డ్రైవర్ దస్తగిరితో పాటు వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన ఇనాయతుల్లాను కూడా విచారించారు. మూడో రోజు వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌, దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాలను తొమ్మిది గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నాలుగో రోజు దస్తగిరి, ఇనాయతుల్లా, వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌ను మళ్లీ పిలిపించారు. వీరితో పాటు మొదటిసారిగా ఒక జిల్లా స్థాయి అధికారిని ప్రశ్నించింది సీబీఐ. అప్పటి నుంచి ఆరోరోజు అయిన శనివారం వరకు వివేకా మాజీ డ్రైవరు దస్తగిరితో పాటు వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్‌యాదవ్‌లను ప్రశ్నిస్తూనే ఉన్నారు. హత్య జరగడానికి 15 రోజుల ముందు వివేకాను కిరణ్‌కుమార్‌ యాదవ్‌ కలిసినట్లు సీబీఐ వద్ద ప్రాథమిక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. మెుత్తానికి మరోవారం రోజుల్లో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story