కరోనా కట్టడిలో టెక్నాలజీ పాత్ర

by  |
కరోనా కట్టడిలో టెక్నాలజీ పాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: హెల్త్ ట్రాకింగ్ యాప్స్‌తో మొదలుపెట్టి ప్రజల కదలికలను మానిటర్ చేసే టూల్స్ వరకు కోవిడ్ 19 నియంత్రణలో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సాయం వల్ల దాదాపు ఎక్కువ శాతం కరోనా వ్యాప్తిని నియంత్రించగలుగుతున్నారు. చైనా ఈ వైరస్ బయటపడినపుడు కెనడాకు చెందిన బ్లూడాట్ అనే టెక్ కంపెనీ కరోనాకు సంబంధించిన ఎపిడెమిక్ ప్రపోర్షన్లను అంచనా వేసి హెచ్చరించగలిగింది. ఇందుకోసం పబ్లిక్ హెల్త్, అడ్వాన్సడ్ డేటా ఎనలిటిక్స్, మెడికల్ ఎక్స్‌పర్టీస్ సాయం తీసుకున్నట్లు బ్లూడాట్ తెలిపింది.

ఇక జనవరి నుంచి ప్రభుత్వాలు వైరస్ కట్టడిలో ముఖ్యంగా టెక్నాలజీ ఉపయోగానికే మొగ్గుచూపాయి. కరోనాను గుర్తించడం, ట్రాక్ చేయడం వంటి పనుల కోసం టెక్నాలజీ ఉపయోగపడింది. అయితే ఏదైనా సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ముందు సమాచారం కావాలి. ఎంతో కొంత ముందస్తు సమాచారం లేనిదే టెక్నాలజీని ఉపయోగించడం చాలా కష్టం. ముఖ్యంగా భారతదేశంలో సరైన అధికారిక సమాచారాన్ని అందివ్వడంలో లోపం కారణంగా వైరస్ కట్టడిలో భాగం కావాలనుకుంటున్న స్టార్టప్‌లకు ఇబ్బంది ఎదురవుతోంది.

హెల్త్ ట్రాకింగ్ యాప్స్

ప్రజలకు కలర్ కోడింగ్ ఇవ్వడం ద్వారా చైనా హెల్త్ మానిటరింగ్ యాప్ అమల్లోకి తీసుకువచ్చింది. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల ద్వారా వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. అలీపే హెల్త్ కోడ్ అని పిలిచే యాప్‌ను అలీబాబా కంపెనీతో కలిసి చైనా తయారుచేసింది. ఇందులో క్వారంటైన్ అవసరమైన వ్యక్తిని గుర్తించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ యాప్ ద్వారా డేటాను పోలీసులకు చేరవేయడమనే విషయంపై వ్యక్తిగత స్వేచ్ఛ అంశం మీద తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. కానీ పాండమిక్ కట్టడిలో ఇలాంటివి కొన్ని తప్పవని చైనా స్పష్టం చేసింది.

ఇదే కోవలో కాలికట్‌కు చెందిన క్యూకాపీ అనే స్టార్టప్ కంపెనీ కేరళ ప్రభుత్వంతో కలిసి ఒక యాప్ డెవలప్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ కేరళ డైరెక్ట్ కేరళ అని పిలిచే ఈ యాప్ కరోనాకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారిక సమాచారాన్ని చేరవేస్తుంది. జిల్లాల వారీగా సమాచారాన్ని డయాగ్రామ్‌లతో సహా ఈ యాప్‌లో చూడొచ్చు.

డేటా ఎనలిటిక్స్

సింగపూర్ దేశం మాదిరిగా భారతదేశానికి అధికారిక డాష్‌బోర్డులు లేవు. అందుబాటులో ఉన్న డాష్‌బోర్డులన్నీ ప్రైవేటు వారివే. కిప్రోష్ అనే స్టార్టప్ కంపెనీ, కుటుంబ సంక్షేమ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో covidout.in వెబ్‌సైట్‌లో ఒక సమాచార డాష్‌బోర్డును నిర్వహిస్తోంది. కచ్చితమైన డేటా లేని కారణంగా తాము సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సీఈఓ అతుల్ రాయ్ అంటున్నారు. ఎంత ఎక్కువ డేటా ఉంటే అంత ఎక్కువ సమాచారాన్ని కోర్రిలేట్ చేసే సదుపాయం కలుగుతుందని ఆయన అన్నారు.

లొకేషన్ ట్రాకింగ్

స్మార్ట్ ఫోన్ సాయంతో లొకేషన్ ట్రాకింగ్ ద్వారా ప్రజల కదలికలను ఎక్కడిక్కడ మానిటర్ చేయగలిగే సదుపాయం కలిగింది. వైరస్ బారిన పడిన వారి కదలికలను బట్టి వారు ఎంతమందికి వ్యాప్తి చెందించి ఉంటారో తెలుసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం గూగుల్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ సంస్థలు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత స్వేచ్ఛకు ఇది భంగం కలిగిస్తోందని విమర్శలు వస్తున్నాయి.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed