తెలంగాణలో మళ్లీ కాస్ట్‌లీ ఎన్నికలు.. ఒక్క ఓటుకు రూ.10 లక్షలు..!

by  |
తెలంగాణలో మళ్లీ కాస్ట్‌లీ ఎన్నికలు.. ఒక్క ఓటుకు రూ.10 లక్షలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: “మొన్న హుజురాబాద్​ఉప ఎన్నికల్లోనే ఓటుకు ఆరు వేల నుంచి పది వేలు ఇచ్చారు. ఇప్పుడు మా ఓట్ల ఎన్నికలు వచ్చాయి. ఎంపీటీసీగా గెలిచిన కాన్నుంచి పైసా పని చేయలే. పనుల కోసం వెళ్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కమీషన్లు అడుగుతున్నారు. ఇప్పుడు మా ఓటుకు కూడా ఐదారు లక్షలు ఇవ్వాల్సిందే. లేకుంటే ఓటు వేయొద్దనుకుంటున్నాం. మా మండలంలోని ఎంపీటీసీలమంతా కూడా అదే అనుకుంటున్నాం. లేకుంటే ఎమ్మెల్సీగా మా ఓట్లతోని గెలిచి కూడా మాకేమైనా పని చేస్తున్నారా..? ఇప్పుడు మేము ఓటుకు ఇంత డిమాండ్​ చేయడంలో తప్పేముంది..?” ఇది హన్మకొండ జిల్లా ధర్మసాగర్​మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆవేదన.

“ఉప ఎన్నిక అంటే లక్షలకు లక్షలు ఇచ్చి కండువా కప్పారు. ఓటుకు పది వేలు పంచారు. అలాంటిది నేనో ఎంపీటీసీని. ఇప్పుడు నేను ఓటేయాలి. ఎంపీటీసీగా గెలిచినా ఏం చేయాలో ఇంత వరకూ తెల్వలే. కానీ, ఇప్పుడు మా ఓట్లతోని ఎమ్మెల్సీ అయితరు. నా ఓటుకు కూడా లక్షలకు లక్షలు ఇవ్వాల్సిందే. లేకుంటే స్వతంత్ర అభ్యర్థికి అయినా వేస్తా.” కరీంనగర్​జిల్లా హుజురాబాద్ మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ వ్యాఖ్యలివి.

రాష్ట్రంలో స్థానిక సంస్థల మండలి పోరు మహా ఖరీదుగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం కూడా హుజురాబాద్​ఉప ఎన్నికలే. అక్కడి ప్రలోభాలు, పంపకాలతో ఇప్పుడు మండలి పోరులో పరిషత్​సభ్యుల ఓట్లకు భారీ డిమాండ్​పెరిగింది. కొన్నిచోట్ల బహిరంగంగా అమ్మకానికి పెడుతున్నారు. దీంతో మండలి ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే అభ్యర్థులు భయపడుతున్నారు.

ఆఖరి సమయం.. అమ్ముకుందాం..

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో భాగంగా పరిషత్​సభ్యుల పదవీకాలం దగ్గర పడింది. మరో ఏడాది నుంచి ఏడాదిన్నర గడువు మాత్రమే ఉంది. ఈ సమయంలో వస్తున్న మండలి ఎన్నికల్లో ఆర్థిక ఆశలు పెరుగుతున్నాయి. దీంతో పార్టీ ఏదైనా.. తమ ఓటును బట్టి రేటును ఇస్తే అటువైపు మొగ్గు చూపేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు. దీనికితోడుగా ఇటీవల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిరగబడుతున్నారు. తమకు ప్రాధాన్యత లేదంటూ, తామే పోటీ చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరందరినీ ఒప్పించుకోవడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ.. ఇవీ ఖరీదైనవిగా మారాయి. అంతా ఒప్పించినా ఓటుకు కనీసం రూ. 5 నుంచి రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్​చేస్తున్నారు. జడ్పీటీసీలు మరికొంత ఎక్కువగానే డిమాండ్​చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల మండలి ఎన్నికలు ఆర్థిక కష్టాలు తెస్తున్నాయి.

పెద్దల సభకు వెనకడుగు

రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక్కో స్థానానికి.. కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒకప్పుడు మండలి సీట్లు అంటే నేతలు హుషారు చూపించేవారు. పెద్దల సభలో ప్రాతినిధ్యం కోసం పోటీ పడేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మండల సీట్లు ఇస్తామన్నా పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. అందులోనూ అధికార పార్టీ నేతలు కూడా అనాసక్తి చూపిస్తున్నారు. రోజురోజుకూ పెరిగిన ఖర్చుకో, పార్టీ ఫండ్, పార్టీ నేతలకు ఇలా పలు రూపాల్లో ఎదురయ్యే ఖర్చులకు జంకుతున్నారు.

రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే, గవర్నర్​కోటాలో తీవ్రంగా పోటీపడిన నేతలు ఆ 12 స్థానిక సంస్థల స్థానాల్లో పోటీకి వద్దంటే వద్దు అంటున్నారు. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నిక నుంచి తేరుకోకముందే గుక్క తిప్పుకోకుండా నోటిఫికేషన్ రావడంతో బెంబేలెత్తుతున్నారు. ఆ స్థానాలకు డబ్బులు పెట్టే స్థోమత ఉండే అభ్యర్థుల కోసం కూడా అధిష్టానాలు వెతుకుతున్నాయి. ప్రస్తుతం సాధారణ ఎన్నికలే ఖరీదుగా మారిన నేపథ్యంలో ఇప్పుడు మండలి ఎన్నికలు సైతం కాస్ట్లీగా మారాయి. దీంతో ఈ భారం ఎవరు భరిస్తారనే చర్చ మొదలైంది. పార్టీ పరంగా కాకుండా ఆర్థికంగా బలమైన అభ్యర్థులెవ్వరనే అంశాలను పరిగణలోకి తీసుకునే టికెట్​ఇచ్చేందుకు అధికార పార్టీ సైతం లెక్కలు వేస్తోంది.

జిల్లాల్లో మారుతున్న సమీకరణాలు

ఉదాహరణగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో 70 మంది జడ్పీటీసీలు, 772 మంది ఎంపీటీసీలు, 481 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఉన్నారు. 1,323 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నుకోవలసి ఉంటుంది. ఆ జిల్లా పరిధిలో 825 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఉండగా, కాంగ్రెస్‌కు 213 మంది, బీజేపీకి 105 మంది, ఎంఐఎంకు 11 మంది, ఇతర పార్టీలకు చెందిన వారు 24 మంది, స్వతంత్రులు 145 మంది ఓటర్లుగా ఉన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికల జరిగిన నాటి పరిస్థితి ఇలా ఉండగా ఆ తర్వాత పెద్ద సంఖ్యలో స్వతంత్రులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

హుజురాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంలో కాంగ్రెస్‌, బీజేపీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి పలువురు ప్రజాప్రతినిధులు రాగా, టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు ఈటల వెంట బీజేపీలో చేరారు. ఈ మార్పులు, చేర్పులు అన్నీ జరిగిన తర్వాత కూడా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకే 70 శాతానికిపైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకలాగే మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. ఇక్కడే అసలు చిక్కులు వస్తున్నాయి.

ప్రస్తుతం ఓటర్లుగా ఉన్న వారిలో ఎక్కువ మంది పరిషత్​సభ్యులే. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చి, సర్పంచ్‌లతో సమానంగా ఎంపీటీసీలు ఉంటారనే కోణంలో ప్రచారం చేసింది. ప్రతి అభివృద్ధి పనిలో ఎంపీటీసీ సభ్యులను భాగస్వాముల్ని చేస్తున్నట్లు చెప్పింది. కానీ, అవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇప్పటి వరకు పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే 10 శాతం నిధులు తప్పా.. ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఎంపీటీసీలకు పని లేకుండా పోయింది. అటు జడ్పీటీసీ సభ్యుల పరిస్థితి కూడా అంతే.

పోటీ చేద్దామా.. వద్దా..?

టీఆర్‌ఎస్​పరిస్థితి ఎలా ఉన్నా.. బీజేపీ, కాంగ్రెస్‌లో మాత్రం ఈ స్థానాల్లో పోటీపై కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల వరుస గెలుపుతో బీజేపీ కొంత ఉత్సాహంతో ఉంది. అయితే మండలి ఎన్నికల్లో పోటీపై ఇంకా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఉన్న వ్యతిరేకతను ‘క్యాష్​’ చేసుకుంటే కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్​పార్టీ నుంచి ఈసారి నల్గొండ జిల్లా నుంచి పోటీ చేసేందుకు చర్చలు సాగిస్తున్నారు. గ్రాడ్యుయేట్​ఎన్నికల్లో ఓటమిపాలై, ప్రత్యక్ష పోటీకి దూరమంటూ ప్రకటించిన చిన్నారెడ్డి.. మళ్లీ ఓసారి పోటీకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం టీపీసీసీ నేతలు గాంధీభవన్‌లో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిని అధికార పార్టీ చేర్చుకుందని, అయినా మండలి ఎన్నికల్లో తమకు ఓటు వేస్తారనే ఆశలున్నట్లు టీపీసీసీకి వివరించారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని టీపీసీసీ వెల్లడించింది.

జిల్లాల వారీగా ఓటర్లు..

ఆదిలాబాద్​931, వరంగల్​1021, నల్లగొండ 1271, మెదక్​1015, నిజామాబాద్​809, ఖమ్మం 769, కరీంనగర్ 1323, మహబూబ్‌నగర్ 1394, రంగారెడ్డి 1302.



Next Story