బిల్లులు రావు.. అధికారులు ఇవ్వరు.. కష్టాల్లో ‘హయర్’ యజమానులు

by  |
Own Plate
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉన్నతాధికారులకు ప్రభుత్వం వాహనాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన వాహనాలకు మెయింటెన్స్, డీజిల్/పెట్రోల్ తో పాటు డ్రైవర్ ను నియమించి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేయలేక ‘హయర్’ వెహికిల్స్ నడిపిస్తోంది. అయితే వాటికి నెలల డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా మంజూరు చేయకపోవడంతో ఫోర్ వీలర్స్ ఓనర్స్ కం డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనం నడపలేక.. కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రంలో 33 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లోని అన్నింటిలోని ఉన్నతాధికారులకు వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని శాఖల్లో కొంత మందికి మాత్రమే ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి. మిగతా వారి కోసం ప్రభుత్వం హయర్(అద్దెవాహనాలను) నడిపిస్తోంది. ఓనర్స్ కం డ్రైవర్లు ఫోర్ వీలర్స్ నడుపుతున్నారు. కొత్తవాహనాలు, కండిషన్ లో ఉన్న వాహనాలను మాత్రమే తీసుకొని నడిపిస్తోంది ప్రభుత్వం.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో సుమారు 3 4వేల వాహనాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తూ ఓనర్స్ కం డ్రైవర్లు జీవనోపాధి పొందుతున్నారు. కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే కొన్ని శాఖల్లో రెండేళ్లు.. మరికొన్నింటిలో 5 నెలల నుంచి 8 నెలలు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఈఎంఐలు, ఇంటి అద్దెలు, డీజిల్, పెట్రోల్ పోయలేక, కారు మెయింటెన్స్ చేయలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

బిల్లులు పెండింగ్‌లో ఉన్న శాఖలు ఇవే..

ఆర్ డబ్ల్యూసీ(మిషన్ భగీరథ)లో హయర్ వెహికిల్స్ కు గత రెండేళ్లుగా బిల్లులు మంజూరు కాకపోవడం గమనార్హం. దీనికి తోడు పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్‌లో 15 నెలలు, డీఆర్‌డీఏలో 7 నెలలు, ఎక్పైజ్ శాఖలో 12 నెలలు, డీపీఓలో 15 నెలలు, కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంట్‌లో 4 నెలలు, గ్రౌండ్ వాటర్‌లో 9 నెలలు, ఆర్‌డబ్ల్యూఎస్‌లో రెండేళ్లు ఇలా అన్ని శాఖల్లోనూ హయర్ వెహికిల్స్‌కు చెల్లించే అద్దెలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఈఎంఐలు చెల్లించలేక…

అద్దె వాహనాలకు ప్రభుత్వం నెలనెలా అద్దెలు చెల్లించకపోవడంతో ఓనర్స్ కం డ్రైవర్లు ఈఎంఐలు చెల్లించడం కష్టమవుతోంది. దీంతో సమయానికి చెల్లించకపోవడంతో కొన్ని ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీలు బెదిరింపులకు పాల్పడటంతో పాటు వాహనాలను బౌన్సర్లు పెట్టి తీసుకెళ్తున్నారు. తిరిగి ఆ వాహనాన్ని తెచ్చుకోవాలంటే అదనంగా మరో రూ.10వేలు చెల్లించాల్సిన పరిస్థితి. దీనికితోడు మెయింటెన్స్ ఖర్చుకు ప్రతి రెండునెలలకు ఒకసారి 3 వేల రూపాయలు వెచ్చించాల్సిందే. ఇదంతా డ్రైవర్లకు గుదిబండగా మారుతోంది.

ఇచ్చేది తక్కువ…

ప్రభుత్వం హయర్ వెహికిల్స్‌కు 2500 కిలో మీటర్లకు జిల్లా కేంద్రాల్లో అయితే నెలకు రూ.33 వేలు, రాజధానిలో అయితే 34 వేల రూపాయలను చెల్లిస్తోంది. టాటా ఇండికా, షిప్టు డిజైర్, డిఎల్ఎస్, ఇండిగో కార్లు లీటర్ డీజిల్ 16 నుంచి 18 కిలో మీటర్లు మాత్రమే మైలేజ్ వస్తుంది. అయితే పెట్రోల్ వాహనాలు అయితే మరో 2 నుంచి 4 కిలో మీటర్లకు అదనంగా వస్తుంది. అయితే గతంలో లీటర్ ధర 80 రూపాయలు ఉంటే గిట్టుబాటు అయ్యేది. అయితే ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.101.33, డీజిల్ ధర రూ.96.17 పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే రూ.33వేలు ఇస్తే సరిపోవడం లేదు. కిలో మీటర్ కు 13.20 రూపాయలు మాత్రమే ఇస్తుండటంతో ఓనర్స్ కం డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం కిలో మీటర్లకు రూ.20 చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని, మా కుటుంబాల ఆర్థిక పరిస్థితిని గమనించి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు డ్రైవర్లు కోరుతున్నారు.

అధికారుల మెలిక?

ప్రభుత్వం ఏ వాహనం కొనుగోలు చేసినా 15 ఏళ్ల పిరియడ్ వ్యాలిడిటీ ఇస్తుంది. దాంతో ఆ వాహనానికి ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ ను వాహనదారుడు 6 నెలలు, సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తుంటాడు. ఈ విషయం అధికారులకు కూడా తెలుసు. కానీ, హయర్ వెహికిల్స్ ఓనర్స్ కం డ్రైవర్లు వాహనాన్ని మూడు నాలుగేళ్లు కాగానే అధికారులు కొత్తవాహనాలు కావాలని, కొత్త వెర్షన్స్ తో వచ్చేవి కావాలి.. లేకుంటే మరో వెహికిల్స్ ను పెట్టుకుంటామని హెచ్చరిస్తున్న సందర్భాలు ఉన్నాయి. షిప్టు డిజైర్ వాహనాలు ఉన్నా వాటిలో రోజురోజుకు కొత్త వెర్షన్ వస్తుండటంతో వాటిని ప్రిపర్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ప్రభుత్వం నెలనెలా అద్దెలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాహనాల ఓనర్స్ కం డ్రైవర్లు… కొత్తవాహనాలు ఎలా తీసుకురావాలో తెలియక… అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక లోలోన కుమిలిపోతున్నారు.

అధికారుల సొంత వాహనాలకే టాక్సీప్లేట్…

కొన్ని శాఖల్లో పనిచేసే అధికారులు హయర్ వెహికిల్స్ పేరిట బంధువుల పేరుతో సొంత వాహనాలకే టాక్సీ ప్లేట్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం చెల్లించే అద్దెలను తీసుకుంటున్నారు. అంతేకాదు ఇన్నోవా హనాలను సైతం వినియోగిస్తుండటంతో ఓనర్స్ కం డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. అయితే సొంతవాహనాలకు టాక్సీ ప్లేట్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్దమని చెప్పినా అధికారులు మాత్రమే వాటికి తిలోధకాలిస్తున్నారు. యథేచ్ఛగా వాహనాలను తిప్పుతుండటం గమనార్హం. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని హయర్ వెహికిల్స్ ఓనర్స్ కం డ్రైవర్లు మంత్రులకు వినతులు ఇచ్చినా స్పందన కరువైంది.

హయర్ వెహికిల్స్ యజమానుల కోరుతుంది ఇదే..

అన్నిశాఖల్లోని హయర్ వెహికిల్స్ పై విజిలెన్స్ ఎంక్వాయిరీ చేయించాలి. పెరిగిన డీజిల్ రేట్లకు అనుగుణంగా వాహన అద్దెలను రూ.33వేల నుంచి రూ.68వేలకు పెంచాలి. పాత బకాయిలు చెల్లించాలి. ఏ నెలకు సంబంధించిన బిల్లు ఆ నెల చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఓన్ ప్లేట్ ని ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని పెట్టి నడిపేవారిపై చర్యలు తీసుకోవాలి. టాక్సీ ప్లేట్ ఉన్న బినామి పేర్లతో నడిపే అధికారులపై చర్యలు తీసుకోవాలి.

విజిలెన్స్ ఎంక్వాయిరీ చేయించాలి

Salavuddeen

అన్ని ప్రభుత్వ శాఖల్లోని హయర్ వెహికిల్స్ పై విజిలెన్స్ ఎంక్వాయిరీ చేయించాలి. కొంత మంది అధికారులు సొంత వాహనాలకు టాక్సీ ప్లేట్ అని తగిలించడం, బినామీ పేర్లతో నడిపించడంతో డ్రైవర్ వృత్తినే నమ్ముకున్న ఓనర్స్ కం డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.
-షేక్ సలావుద్దీన్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్

పెండింగ్ బిల్లులు చెల్లించాలి

Somesh

నేను ఫైనాన్స్‌లో కారును కొనుగోలు చేసి ఓ ప్రభుత్వ శాఖలో పెట్టాను. నెలనెల వచ్చే వాహన అద్దెతో ఈఎంఐలతో పాటు వాహన మెయింటెన్స్, కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అయితే గత ఐదు నెలలుగా బిల్లులు రావడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే వాహనాన్ని తీసుకుపోతామని ఫైనాన్స్ కంపెనీ బెదిరిస్తోంది. ఒకవేళ తీసుకొనిపోతే రూ.10వేలు చెల్లించి తీసుకొచ్చుకోవాలి. ఏం చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేసి నా కుటుంబాన్ని ఆదుకోవాలి.
-మేడబోయిన సోమేష్, హయర్ వెహికిల్ ఓనర్స్ కం డ్రైవర్

వాహనాల అద్దె పెంచాలి

Abdul

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాలను నడపలేకపోతున్నాం. ప్రభుత్వం 2500 కిలోమీటర్లకు రూ.33వేలు ఇస్తుంది. దీంట్లో సగానికిపైగా డీజిల్ కే సరిపోతుంది. ఈఎంఐలు చెల్లించడం, కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా అద్దె నెలకు రూ.60 వేలకు పెంచాలి.
-ఎండీ అబ్దుల్ ఖాదీర్, హయర్ వెహికిల్ ఓనర్స్ కం డ్రైవర్

Next Story

Most Viewed