క్యాప్‌జెమినిలో భారీ నియామకాలు

by  |
క్యాప్‌జెమినిలో భారీ నియామకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్‌జెమిని ఈ ఏడాది దేశీయంగా భారీ నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది. మొత్తం 30,000 మంది ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు క్యాప్‌జెమిని సీఈఓ అశ్విన్ యార్డి చెప్పారు. ఇది గతేడాదితో పోలిస్తే 25 శాతం పెరిగిందని.. ఈ నియామక పెరుగుదలతో దేశీయంగా కంపెనీ 7-9 శాతం బలమైన ఆదాయ వృద్ధిని సాధిస్తుందని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం కలిగిన వారిని కూడా 50:50 నిష్పత్తిలో నియమించుకోనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), ఆర్అండ్‌డీ, 5జీ, ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యం ఉన్న వారిని తీసుకోనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో క్యాప్‌జెమిని మొత్తం ఆదాయంలో 65 శాతం వాటా డిజిటల్ పరిష్కారాలు, క్లౌడ్ బిజినెస్‌దే. కరోనా నుంచి బయటపడుతున్న సమయంలో వ్యాపారం పుంజుకుంటోందని, భారీ డీల్స్‌ను సాధిస్తామనే నమ్మకం ఉందని, అందుకే నియామకాలను పెంచినట్టు కంపెనీ వెల్లడించింది. కాగా, అంతర్జాతీయంగా 2,70,000 మంది ఉద్యోగులను కలిగిన క్యాప్‌జెమిని భారత్‌లో మాత్రమే 1,25,000 మంది ఉద్యోగులతో అతిపెద్ద టాలెంట్ హబ్‌గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ఐటీ నియామకాలు పెరుగుతున్నాయి. దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ 15 వేల మందిని నియమించుకుంది. మరో సంస్థ కాగ్నిజెంట్ ఈ ఏడాది 23 వేల మందిని తీసుకోవాలని భావిస్తోంది. ఇది గతేడాది కంటే 35 శాతం అధికం.



Next Story

Most Viewed