కేంద్రం మరో షాక్.. పెరగనున్న క్యాబ్ ధరలు

by  |
కేంద్రం మరో షాక్.. పెరగనున్న క్యాబ్ ధరలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సామాన్య ప్రజలకు కేంద్రం మరో షాక్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్థికంగా అన్ని రకాలుగా సతమతం అవుతున్న వీరిపై మరో భారం మోపేందుకు సిద్ధం అవుతోంది. ఆన్ లైన్ ద్వారా ఆటోలు బుక్ చేసుకునే ప్రయాణికులకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. 2022 జవనరి నుంచి ఆటో ప్రయాణం చేయాలనుకునేవారు ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే 5 శాతం మేర జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఓలా, ఉబర్ ఆటోలు, కార్లలో ప్రయాణించేందుకు ఆన్ లైన్ లో బుక్ చేసుకునేవారికి ఈ భారం పడనుంది. సాధారంగా ఆటోలో వెళ్లేవారిపై ఎలాంటి జీఎస్టీ లేదు. ఆన్ లైన్ బుకింగ్స్ పైనే 5శాతం వడ్డన పడనుంది. వీరితో పాటు యాప్ బేస్ ఆధారిత కంపెనీలు అమెజాన్, స్విగ్గీ, జొమోటో, బిగ్ బాస్కెట్, షాడో పాక్స్ తదితర కంపెనీల డెలివరీ బాయ్స్ పై అదనపు భారం పడనుంది.

కరోనాతో ఇప్పటికే టాక్సీ రంగం కుదేలైంది. పెట్రోల్, డీజిల్ పెరుగుదలతో అదనపు భారం పడింది. ఇప్పటికే కొంతమంది డ్రైవర్లు వృత్తి మాని లేబర్ పని చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఆ టాక్సీపై మరోమారు జీఎస్టీ రూపంలో పిడుగుపడనుంది. జీఎస్టీ 5 శాతం పెంచేందుకు కేంద్రం సన్నద్ధమవుతుండటంతో డైలామాలో పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఆటోలు, 4.80లక్షల కార్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువశాతం ఓలా, ఉబర్ కంపెనీ కింద పనిచేస్తున్నాయి. 2014లో మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 67(1) ప్రకారం ప్రభుత్వం ధరలను పెంచింది. కనీస ఛార్జీలు (1.6 వరకు కిమీలు) రూ.20.00, ప్రతి తదుపరి కిలో మీటర్‌కు ప్రతి నిమిషానికి ఛార్జీలు రూ. 50 పైసలు, లగేజీ రూ.11.00 నిర్ణయించింది. జీఎస్టీని విధించలేదు. అయితే గత ఏడాది నుంచి ఓలా, ఉబర్ కంపెనీలు వచ్చే అమౌంట్ లో జీఎస్టీ అని కోత విధిస్తున్నారు. అయితే ఇప్పటివరకు డ్రైవర్లే భరిస్తున్నారు. కంపెనీలు భరించాలని, కరోనా సమయంలో ఆదుకోవాలని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. దీంతో కొంత మంది డ్రైవర్లు ఆ కంపెనీల నుంచి వైదొలిగారు. ఇప్పటికే పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు గుదిబండగా మారగా, ఆశించిన విధంగా ట్రిప్పు(గిరాకీ)లు రాకపోవడంతో ప్రతినెలా ఈఎంఐలు చెల్లించలేకపోతున్నారు. ఈ తరుణంలోనే కేంద్రం జనవరి 1 నుంచి 5శాతం జీఎస్టీ విధించాలని యత్నిస్తుండటం మరింత భారంగా మారనుంది. అంతంతమాత్రంగానే కొనసాగుతున్న టాక్సీలపై మరింత ప్రభావం పడనుంది.

జీఎస్టీ పెంచవద్దని టాక్సీ డ్రైవర్స్ యూనియన్లు సన్నద్ధమవుతున్నాయి. కరోనా ఇంకా అదుపులోకి రావడంతో పూటగడవడమే కష్టంగా మారిన తరుణంలో జీఎస్టీ పెంపును ఎలా పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాలను ఆదుకునేందుకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం టాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చచేశారు. అసలు కిలో మీటర్ కు ఎంత జీఎస్టీ విధిస్తారు? ఎవరు భరిస్తారు? అనేదానిపై ఓలా, ఉబర్ కంపెనీలు గానీ ప్రభుత్వం గానీ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో జీఎస్టీ భారం పరోక్షంగా ప్రయాణికులపై పడనుంది.

కంపెనీలు భరించేలా చర్యలు తీసుకోవాలి

కేంద్రం జీఎస్టీ పెంపుతో ట్యాక్సీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కరోనాతో ఆర్థికంగా డ్రైవర్లు కుంగిపోయారు. ఇప్పుడు జీఎస్టీ పెంచితే అదనపు భారం పడనుంది. మరో వైపు ప్రయాణికులపై పరోక్షంగా పడుతుంది. ఈ భారం కంపెనీలు భరించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. డ్రైవర్లకు వస్తున్న ఆదాయంలోనే జీఎస్టీ ఎక్కువ కట్ కావడంతో ఇబ్బందులు పడతారు. అసలు ప్రభుత్వం ఎంత జీఎస్టీ వేస్తుంది. కిలో మీటర్ కు ఎంత? అసలు ఎవరు భరించాలనే దానిపై క్లారిటీ ఇవ్వాలి.
=షేక్‌ సలావుద్దీన్‌, చైర్మన్‌ , తెలంగాణ స్టేట్‌ ట్యాక్సీ అండ్‌ డ్రైవర్స్‌ జేఏసీ

జీఎస్టీ ఉపసంహరించునేవరకు నిరసనలు

కరోనాతో ట్యాక్సీలకు కిస్తీలు కూడా కట్టలేక అమ్ముకొని డ్రైవర్ వృత్తికి ఇప్పటికే కొంత మంది దూరమయ్యారు. కుటుంబ పోషణ కోసం కొంత మంది వృత్తిని కొనసాగిస్తున్నారు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలకు అనుగుణంగా ఓలా, ఉబర్ కిలో మీటర్ కు రేటు పెంచాలని డిమాండ్ చేశాం. కానీ ఇప్పటివరకు స్పందన లేదు. దీనికి తోడు కేంద్రం జీఎస్టీ 5 శాతం పెంచుతామని ప్రకటించడం మరింత భారంగా మారనుంది. డ్రైవర్ల మనుగడకు కేంద్రం జీఎస్టీ పెంపును ఉపసంహరించుకోవాలి. లేకుంటే నిరసన కార్యక్రమాలు చేపడతాం- వెంకటేశం గౌడ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ, తెలంగాణ ప్రైవేట్ మోటార్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్

Next Story

Most Viewed